Revanth Reddy and KTR
KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డికి కోతలు సరిపోవని, కర్రుకాల్చి వాత పెట్టాలి అని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చాలా మంది ముఖ్యమంత్రులను చూశాము. ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ఆర్, రోశయ్య, కేసీఆర్ లాంటి వాళ్ళను చూశాము. ఇలాంటి ముఖ్యమంత్రిని ఎన్నడూ చూడలేదన్నారు కేటీఆర్.
సిగ్గు లేకుండా వంద అసెంబ్లీ సీట్లను గెలుస్తామని రేవంత్ రెడ్డి అంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు. నన్ను కోసుకున్నా పర్వాలేదు, ఢిల్లీ పోతే అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు అని ఏ ముఖ్యమంత్రి అంటారా అని కేసీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ ను తిట్టడమే రేవంత్ రెడ్డి అజెండా అని ధ్వజమెత్తారు. కేసీఆర్ లేకుంటే రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవారా? అని అడిగారు.
Also Read: చెంచులకు 13,000 ఇందిరమ్మ ఇళ్లు.. మంజూరు పత్రాల పంపిణీ: మంత్రి పొంగులేటి
మాజీ మంత్రి హరీశ్ రావు కింద రేవంత్ రెడ్డి పని చేశారు, హరీశ్ రావు కారు ముందు రేవంత్ రెడ్డి డ్యాన్స్ వేశారు అని కేటీఆర్ అన్నారు. తెలంగాణను అవమానించకుండా కేసీఆర్ కంటే ఎక్కువ చేసి చూపించాలని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాలు బీఆర్ఎస్ గెలవడం ఖాయం అని కేటీఆర్ జోస్యం చెప్పారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో మూడు జిల్లా పరిషత్ స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హరీశ్ నాయకత్వంలో మెదక్ జిల్లాలో అన్ని సీట్లు గెలిచి.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.