Telangana
Telangana: తెలంగాణలో ఈ ఏడాది నుంచి మరో కొత్త కోర్స్ అందుబాటులోకి రానుంది. ఇంటర్ విద్యలో ఫార్మసీ కోర్సు ఒకదాన్ని విద్యామండలి ప్రవేశపెట్టనుంది. ఫార్మా టెక్నాలజీ పేరుతో ఈ ఏడాది నుండే ఈ కోర్సు ప్రారంభించనున్నారు. ముందుగా రాష్ట్రంలో నాలుగు కాలేజీలలో ఈ కొత్త కోర్సు ప్రారంభం కానుంది. హైదరాబాద్ నాంపల్లి ప్రభుత్వ ఒకేషనల్ కాలేజీ, సికింద్రాబాద్ ప్రభుత్వ జూ.కాలేజీ, నల్గొండ, భువనగిరి ప్రభుత్వ కాలేజీల్లో ఈ కోర్సును ప్రారంభించనున్నారు.
తెలంగాణ విద్యామండలి ప్రారంభించనున్న ఈ కోర్సు కోసం డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీతో ఒప్పందం కూడా చేసుకోగా.. ఈ కోర్సు పూర్తిచేసుకున్న విద్యార్థులకు ఆ సంస్థలోనే ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది. కరోనా మహమ్మారి ప్రపంచం మీద దండెత్తిన అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఫార్మాకి సంబంధించిన కోర్సులకు డిమాండ్ పెరిగింది. ఈక్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం కొత్త కోర్సును ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది.
ఇప్పటి వరకు ఫార్మసీ విద్యలో బీ ఫార్మసీతోపాటు ఫార్మా-డీ కోర్సులు అందుబాటులో ఉండగా ఇంటర్ పూర్తిచేసిన వారికి ఈ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. అయితే, ఇప్పుడు ప్రవేశపెట్టే ఈ కోర్సు ద్వారా ఇంటర్ స్థాయిలో కూడా ఫార్మసీ కోర్సును తీసుకొచ్చింది. ఈ కోర్సు పూర్తిచేసిన వారికి రెడ్డీస్ ల్యాబ్స్‌లోనే అప్రెంటిస్‌షిప్‌తోపాటు ఉద్యోగం ఇవ్వనుండగా.. అక్కడే ఉద్యోగాలు చేసుకుంటూ ఆ పై కోర్సులను కూడా చేసుకొనే అవకాశం ఇవ్వనున్నారు.