Weather Updates : బంగాళాఖాతంలో ఊహించని మార్పులు.. మళ్లీ చురుకుగా రుతుపవనాలు.. ఈ ప్రాంతాల్లో దంచికొట్టనున్న వానలు
Weather Updates : ఎల్ నినో ప్రభావంతో వర్షాల కాలంలో ఎండల తీవ్రత పెరుగుతోంది.. ఇలాంటి పరిస్థితుల్లో బంగాళాఖాతంలో ఏర్పడుతున్న కొత్త వాతావరణ పరిస్థితులు రుతుపవనాలకు కొత్త ఊపిరిలూదుతూ వర్షాలపై ఆశలు రేపుతున్నాయి.
- Harish Thanniru
- Published on- July 15, 2026 / 11:56 AM IST
Weather Updates
Weather Updates : ఎల్‌నినో ప్రభావంతో భారతదేశంలో ప్రస్తుతం వర్షాకాలంలో కూడా ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా ఎండల తీవ్రత పెరుగుతోంది. దీంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే విత్తనాలు విత్తిన రైతులు అవి మొలకెత్తక పోవడంతో నష్టాలపాలయ్యారు. సాగు ప్రారంభంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే.. రాబోయే రోజుల్లో పంటల సాగుపై అన్నదాతల్లో ఆందోళన తీవ్రమవుతోంది.. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ ఓ శుభవార్త చెప్పింది. రుతుపవనాల్లో మళ్లీ కదలిక వస్తున్నట్లు తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడుతున్న కొత్త వాతావరణ పరిస్థితులు రుతుపవనాలకు కొత్త ఊపిరిలూదుతూ వర్షాలపై ఆశలు రేపుతున్నాయి. బంగాళాఖాతంలో జరుగుతున్న ఈ మార్పుల వల్ల సముద్రపు గాలులు బలంగా వీస్తూ, దట్టమైన మేఘాలు అలముకుంటున్నాయి. రెండుమూడు రోజుల్లో ఈ పరిస్థితి మరింత బలపడి అల్పపీడనంగా మారనుంది. ఈ అల్పపీడనం క్రమంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు పయనించి తూర్పు భారతంలో విస్తారంగా వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ పరిణామాలతో ఇప్పటికే బలహీన పడిన రుతుపవనాలు మళ్లీ పుంజుకోనున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనూ పలు ప్రాంతాల్లో రోబోయే వారం రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది.
ముఖ్యంగా తెలంగాణ ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, గురువారం నుంచి ప్రారంభయ్యే వానలు వారంరోజులు పాటు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. అయితే, రుతుపవనాల్లో మళ్లీ కదలికలు వచ్చినా అవి ఎంత వరకు విస్తరిస్తాయనేది దాని బలం, మార్గం, తీవ్రత, కాలపరిమితిపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. వాస్తవానికి బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడన పరిస్థితులు.. పశ్చిమ పసిఫిక్ లో వాతావరణ అవాంతరాల వల్ల ఏర్పడ్డాయి. దీనివల్ల తైవాన్ ను దాటుకొని కొరియా తీరంవైపు కదులుతూ ఆ ప్రాంతంలో భారీ వర్షాలకు కారణమవుతోంది.
అంతా అనుకున్నట్లు జరిగితే .. వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఈ పరిణామం ఊరటనివ్వనుంది. ముఖ్యంగా ఖరీఫ్ పంటల సాగుకు ఈ వర్షాలు అనుకూలంగా మారే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అలాగే రిజర్వాయర్లు, చెరువులు, భూగర్భ జలాల మట్టాలు కూడా మెరుగుపడే అవకాశముంది.
