Nilam Madhu Mudiraj Resigns Congress (Photo : Twitter)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రసవత్తర సన్నివేశాలు కనిపిస్తున్నాయి. రాత్రికి రాత్రే సీన్ మారిపోతోంది. గంట క్రితం ఒక పార్టీలో ఉన్నవారు సడెన్ గా కండువా మార్చేస్తున్నారు. అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు తగ్గేదేలే అంటున్నారు. ఈ పార్టీ కాకపోతే మరో పార్టీ.. కానీ పోటీ చేసేది మాత్రం పక్కా అంటున్నారు. నీలం మధు ముదిరాజ్ ఇప్పుడు అదే పని చేశారు.
తొలుత కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయనకు పటాన్ చెరు నుంచి పోటీ చేసే అవకాశం దక్కింది. అయితే కాంగ్రెస్ హైకమాండ్ బీఫామ్‌ను పెండింగ్‌లో పెట్టింది. గురువారం రాత్రి ప్రకటించిన చివరి జాబితాలో నీలం మధుకు కాంగ్రెస్ పెద్దలు పెద్ద షాక్ ఇచ్చారు. ఆయన బదులు కాటా శ్రీనివాస్ గౌడ్ కు పటాన్ చెరు టికెట్ ఇచ్చారు. దీంతో నీలం మధు హర్ట్ అయ్యారు. వెంటనే ఆయన కాంగ్రెస్ కు షాక్ ఇచ్చారు.
ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నీలం మధు ముదిరాజ్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేశారు. ఆ వెంటనే తన అనుచరులతో కలిసి బీఎస్పీలో చేరిపోయారు. అంతేకాదు పటాన్ చెరు బీఎస్పీ అభ్యర్థిగా నామినేషన్ కూడా వేసేశారు. ఈ చర్యతో కాంగ్రెస్ శ్రేణులు అవాక్కయ్యాయి.
ముందు తనను అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్.. ఆ తర్వాత మరొకరికి ఆ టికెట్ ఇవ్వడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నీలం మధు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. బీఎస్పీ టికెట్‌ను ఖరారు చేసుకున్నారు. ఆ పార్టీ తరఫున నామినేషన్ కూడా దాఖలు చేశారు.
కాగా.. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ తన పంతం నెగ్గించుకున్నారు. పటాన్ చెరు, నారాయణ్ ఖేడ్ సీట్లను తన అనుచరులకు ఇప్పించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మూడో జాబితాలో అనూహ్య మార్పు జరిగింది. నారాయణ్‌ఖేడ్ అభ్యర్థిని పార్టీ అధిష్ఠానం మార్చింది. గతంలో ప్రకటించిన సురేశ్ షెట్కార్ బదులు సంజీవ్ రెడ్డికి టికెట్ కేటాయించింది. ఇక సూర్యాపేటలోనూ పటేల్ రమేశ్ రెడ్డిని కాదని సీనియర్ నేత, మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డికి టికెట్ ఇచ్చింది. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న రమేశ్ రెడ్డి.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.
నీలం మధు తొలుత బీఆర్ఎస్ లో ఉన్నారు. ఆ పార్టీ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డికి టికెట్ దక్కింది. దీంతో అసంతృప్తికి గురైన నీలం మధు బీఆర్ఎస్ ను వీడారు. కాంగ్రెస్, బీజేపీలో టికెట్ హామీ కోసం ప్రయత్నాలు చేశారు. చివరికి కాంగ్రెస్ నుంచి హామీ లభించడంతో కొన్ని రోజుల క్రితం ఆ పార్టీలో చేరారు. ఆయన కోరుకున్నట్లే పటాన్ చెరు అభ్యర్థిగా మధుని ప్రకటించింది కాంగ్రెస్. కానీ, బీఫామ్ మాత్రం ఇవ్వలేదు.
నీలం మధుకు టికెట్ ప్రకటించడాన్ని పటాన్‌చెరుకు చెందిన కాంగ్రెస్ నేత, టికెట్ ఆశావహుడు కాటా శ్రీనివాస్ తీవ్రంగా వ్యతిరేకించారు. తొలి నుంచీ పార్టీలో కష్టపడిన తమకు కాకుండా కొత్తగా చేరిన వ్యక్తికి టికెట్ ఖరారు చేయడమేంటని పార్టీ పెద్దలను నిలదీశారు. దీంతో నీలం మధుకు కాంగ్రెస్ బీఫామ్ దక్కలేదు. ఆ తర్వాత గురువారం రాత్రి ప్రకటించిన జాబితాలో నీలం మధుకి షాక్ ఇచ్చింది కాంగ్రెస్. పటాన్‌చెరు టికెట్‌ను నీలం మధు స్థానంలో కాటా శ్రీనివాస్‌కు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది.
Also Read : అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తున్నా.. శామ్యూల్ ను గెలిపించి రేవంత్, సోనియాకు గిఫ్ట్ ఇస్తా : అద్దంకి దయాకర్
కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు నీలం మధు. నమ్మించి మోసం చేశారంటూ ఆరోపించారు. స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేస్తానని.. కాంగ్రెస్‌ను ఓడించాలని తన అనుచరులకు పిలుపునిచ్చారు. నీలం మధును కలిసిన పటాన్‌చెరు బీజేపీ అభ్యర్థి నందీశ్వర్‌గౌడ్.. బీజేపీలోకి ఆహ్వానించారు. ఎన్నికల్లో మద్దతు తెలపాలని కోరారు. అందుకు నిరాకరించిన మధు.. చివరికి బీఎస్పీలో చేరారు. అంతేకాదు బీఫామ్ కూడా దక్కించుకున్నారు.