రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు, సీఎం రేవంత్‌ను బర్తరఫ్ చేయాలి- బీఆర్ఎస్ నేతలు

రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయి. కంచే చేను మేసినట్లు పోలీసులు వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో నయా నయీమ్ గ్యాంగులు తయారవుతున్నాయి.

BRS Allegations : రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. పోలీసులు తమ డ్యూటీ చేయడం లేదన్నారు. రోజురోజుకి రాష్ట్రంలో నేరాలు, ఘోరాలు పెరిగిపోతున్నాయని చెప్పారు. కాంగ్రెస్ హైకమాండ్ సీఎం రేవంత్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతలు.

కొల్లాపూర్ లో గిరిజన మహిళ ఘటనపై బీఆర్ఎస్ నేతలు సీరియస్ అయ్యారు. ఈ ఘటనలో డీఎస్పీ సహా అధికారులపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పోలీసుల వైఖరి కారణంగా ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. చెంచు మహిళకు కార్పొరేట్ వైద్యం అందించాలని, బాధిత కుటుంబానికి 50 లక్షల రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి.

హైదరాబాద్ లో 24 గంటల్లో 5 హత్యలు, 2 హత్యాయత్నాలు- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
”దేశంలో హోం, విద్యా శాఖ లేని రాష్ట్రం తెలంగాణ మాత్రమే. రాష్ట్రం పూర్తిగా అభద్రతా భావంతో బతికే పరిస్థితి ఏర్పడింది. ఓ గిరిజన మహిళను కిడ్నాప్ చేసి వారం రోజులుగా లైంగిక దాడి జరుపుతుంటే పోలీసు వ్యవస్థ గుర్తించలేదు. పోలీస్ స్టేషన్ లోనే ఆత్మహత్య చేసుకుంటే.. ఆధారాలు లేకుండా చేసేందుకు సీసీ కెమెరాలు పని చేయడం లేదంటున్నారు. మృతురాలి కుటుంబసభ్యులను రానివ్వకుండానే అంత్యక్రియలు పూర్తి చేశారు. 40రోజుల క్రితం శ్రీధర్ రెడ్డి హత్య జరిగితే తండ్రి ఫిర్యాదును పట్టించుకోలేదు. ఓ హత్య కేసులో నిందితులను పట్టించుకోలేదు.

కరెంట్ పోయిందని పోస్టు పెడితే జర్నలిస్ట్ పై కేసు పెట్టారు..
హైదరాబాద్ లో 24 గంటల్లోనే 5 హత్యలు, 2 హత్యాయత్నాలు జరిగితే శాంతిభద్రతల ఎక్కడున్నాయి? కరెంట్ పోయిందని సోషల్ మీడియాలో పోస్టు పెడితే ఓ మహిళా జర్నలిస్ట్ పై కేసు పెట్టారు. ఈ పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు. ప్రశ్నించే వాళ్ళపై కేసులు పెట్టి అరెస్ట్ చేసే పనిలో ఉన్నారు. సీసీఎస్ దగ్గరే లంచం తీసుకుంటూ పట్టుబడతారు. నిందితులు కత్తులతో వెళ్లి అరెస్ట్ చేయాలని అంటున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ సీఎం రేవంత్ ను బర్తరఫ్ చేయాలి. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయి. కంచే చేను మేసినట్లు పోలీసులు వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో నయా నయీమ్ గ్యాంగులు తయారవుతున్నాయి” అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.

మూల్యం చెల్లించక తప్పదు- గువ్వల బాలరాజు
రాష్ట్రంలో జరుగుతున్న దుర్ఘటనలపై మేము ప్రశ్నిసుంటాము. నిర్లక్ష్యంగా ఉంటే ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు. కొల్లాపూర్ ఘటనపై సీఎం స్పందించి బాధిత మహిళకు మెరుగైన వైద్యం అందించాలి.

Also Read : ఎమ్మెల్యే భార్య రూపాదేవి ఆత్మహత్యకు కారణమదే.. కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు

ట్రెండింగ్ వార్తలు