CM Revanth Reddy : విద్యార్థులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కీలక ప్రకటన!
CM Revanth Reddy : తెలంగాణ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సీఎం రేవంత్ గుడ్ న్యూస్ అందించారు. ఇకపై ప్రతి ఏడాది ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించనున్నట్టు వెల్లడించారు.
- Sreehari A
- Published on- July 28, 2026 / 06:31 PM IST
CM Revanth Reddy
- విద్యార్థులు ఎగిరిగంతేసే న్యూస్..
- ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఇక నో వెయిటింగ్
- ప్రతి ఏడాది చెల్లించేలా కొత్త విధానం తీసుకువస్తాం
CM Revanth Reddy : విద్యార్థులకు సీఎం రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో విద్యార్థులు ఇకపై ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం నెలలు, సంవత్సరాలు ఎదురుచూడాల్సిన పనిలేదు. అతిత్వరలోనే ఈ పరిస్థితికి ముగింపు పలకనుంది రాష్ట్ర ప్రభుత్వం.
ఇక నుంచి ఏ విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అదే విద్యా సంవత్సరంలో విద్యార్థులకు అందించేలా శాశ్వత వ్యవస్థను తీసుకొస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందుకోసం ప్రతి ఏడాది అవసరమయ్యే రూ.2,200 కోట్లను ముందుగానే కేటాయించి, చెల్లింపులు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపుల్లో జాప్యానికి చెక్ పెట్టేందుకు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏ విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అదే ఏడాదిలో పూర్తి చేసే విధంగా కొత్త వ్యవస్థను అమలు చేయనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ప్రతి ఏడాదిలో ఇందుకోసం సుమారు రూ.2,200 కోట్లు అవసరమవుతాయన్నారు. ఆయా నిధులను ముందుగానే బ్యాంకు ఖాతాల్లో జమ చేసి విద్యార్థులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చూస్తామని సీఎం హమీ చెప్పారు.
Read Also : ITR Filing 2026 : ITR ఫైల్ చేస్తున్నారా? జూలై 31 డెడ్‌లైన్ ముందు ఈ 5 మిస్టేక్స్ అస్సలు చేయొద్దు!
గత ప్రభుత్వ హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.8వేలకు కోట్లకు చేరాయని సీఎం రేవంత్ ఆరోపించారు. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగానూ అలాగే సమయానికి నిధులు విడుదలను అమలు చేస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేశాకే తెలంగాణపై బీజేపీ నేతలు రామచంద్రరావు, ఆర్. కృష్ణయ్య విమర్శలు చేయాలని సూచించారు.
కోర్టు తీర్పును పరిశీలిస్తాం :
హైడ్రాపై కూడా సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కుల ఆక్రమణల తొలగింపుపై హైడ్రా కీలక సంస్కరణగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. భూ ఆక్రమణదారులతో ఎలాంటి రాజీ ఉండదన్నారు. హైడ్రా ఇకపై కూడా కొనసాగుతుందని తేల్చిచెప్పారు. కోర్టు తీర్పును పూర్తిగా పరిశీలించిన తర్వాతే తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని సీఎం వెల్లడించారు.
అదేవిధంగా, రాష్ట్రంలో బతుకమ్మ కుంట భూ ఆక్రమణ అంశంపై కూడా సీఎం రేవంత్ విమర్శించారు. 10 ఎకరాల భూమిని ఆక్రమించిన వ్యక్తి కేసీఆర్ పర్యటనలో పూల వర్షం కురిపించాడని ఆరోపించారు. కబ్జా చేసిన వ్యక్తి పూల వర్షమే కాదు.. కనకవర్షం కూడా కురిపించగలడని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. విద్యార్థుల భవిష్యత్తుకు భంగం కలగకుండా అవసరమైన చట్టాలు తీసుకొస్తామన్నారు. అలాగే, ప్రశ్నాపత్రాల లీకేజీలపై కూడా కఠిన చర్యలు కొనసాగిస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.
