సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ మరోసారి వాయిదా.. తదుపరి విచారణ ఎప్పుడంటే?

జూలై చివరి వారంలో విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఎవరు ఏఏ అంశాలపై లిఖితపూర్వకంగా ఇవ్వాలనుకుంటున్నారో వాటన్నింటిని అందించాలని ..

Note for Vote Case: సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. ఓటుకు నోటు వ్యవహారంపై సీబీఐ విచారణ చేపట్టాలన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ పై సుప్రీంకోర్టు
విచారణ జరిపింది. వేసవి సెలవుల అనంతరం కేసు విచారణ చేపడతామని జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎస్విఎన్ భట్టిల ధర్మాసనం పేర్కొంది. దీంతో తదుపరి విచారణను జులై 24వ తేదీకి వాయిదా వేసింది. అయితే, ఈ కేసులో చట్టానికి సంబంధించి అనేక అంశాలు ముడిపడి ఉన్నాయని, రెండు వారాల్లో కేసుతో ముడిపడి ఉన్న చట్టపరమైన అంశాలతో కూడిన వివరాలను అందించేందుకు సమయం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది.
రెండు వారాల తర్వాత సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు వస్తున్నాయని, కేసు విచారణ పూర్తిస్థాయిలో జరగటానికి అవకాశం లేదు కాబట్టి సెలవులు అనంతరం విచారణకు తీసుకోవాలని చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్ర కోర్టును కోరారు.

Also Read : బీజేపీని ఢీకొట్టేందుకు కాంగ్రెస్ సీట్ల త్యాగం.. ఈసారి అతి తక్కువ స్థానాల్లో పోటీ

2015లో జరిగిన వ్యవహారం ఇది.. ఏళ్ల తరబడి కేసు పెండింగ్ లో ఉంటుంది. ప్రతిసారి ఏదో ఒక సాకుతో కేసు విచారణ పడుతూ వస్తోంది. విచారణను త్వరితగతిన చేపట్టాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపు సీనియర్ న్యాయవాది బసంత్ కోరారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాదులు, చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదనలను పరిగణలోకి తీసుకొని సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది. కేసుల విచారణలో వాయిదాలు కోరడం సహజం.. అదివేరే కేసుల్లో మీకుకూడా వర్తిస్తుందని బసంత్ కు జస్టిస్ ఎంఎం సుందరేష్ వివరించారు. ఇన్ని సంవత్సరాలు ఆగిన విచారణ రెండు వారాలతో ఏమీ మారిపోదు కాబట్టి.. వేసవి సెలవుల తర్వాత విచారణకు తీసుకుంటామని ధర్మాసనం పేర్కొంది.

Also Read : కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ నాయకత్వం ఉన్నంత వరకు మాకు ఢోకా లేదు: కిష‌న్‌రెడ్డి

జూలై చివరి వారంలో విచారణ చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎవరు ఏఏ అంశాలపై లిఖితపూర్వకంగా ఇవ్వాలనుకుంటున్నారో వాటన్నింటిని అందించాలని, జూలై 24 తరువాత వాయిదాలు కోరవద్దని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు జూలై 24కి వాదాయి వేసింది.

 

ట్రెండింగ్ వార్తలు