NTR Death Anniversary
NTR Death Anniversary: తెలుగుదేశం వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. శనివారం ఉదయం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు నందమూరి కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లు చేరుకొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ కుమారులు నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ, మనుమరాలు సుహాసిని, తదితర కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకొని నివాళులర్పించారు. అనంతరం ఏపీ మంత్రి నారా లోకేశ్, నారా భువనేశ్వరితో కలిసి ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకొని పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Also Read: Polavaram Project : ముహూర్తం ఫిక్స్.. పోలవరం ప్రాజెక్టు పనుల్లో కీలక పరిణామం
బాలకృష్ణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ నటుడిగా, నాయకుడిగా తనకు తానే సాటి అన్నారు. ఎన్టీఆర్ తోనే తెలుగువారిలో రాజకీయ చైతన్యం వచ్చిందని, ఎన్టీఆర్ సాహసోపేతమైన పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు. ప్రజల వద్దకు పాలన తీసుకురావడానికి ఎన్టీఆర్ ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని చెప్పారు. ఎన్టీఆర్ ముందు.. ఎన్టీఆర్ తరువాత అనేవిధంగా తెలుగు రాజకీయాలు ఉన్నాయని బాలకృష్ణ పేర్కొన్నారు.
మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదు.. ప్రభంజనం అన్నారు. రెండు రూపాయలకు కిలో బియ్యం, మహిళలకు ఆస్తుల్లో సమాన వాటా తదితర సంస్కరణలు తీసుకొచ్చారని కొనియాడారు. ఎన్టీఆర్ కు తప్పనిసరిగా భారతరత్న వస్తుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణలో పార్టీ పున:నిర్మాణంపై దృష్టిసారించామని చెప్పిన లోకేశ్.. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. తెలంగాణలో 1.60 కోట్ల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారని, టీడీపీపై తెలంగాణ ప్రజలకు ఎంతో ప్రేమ ఉందని పేర్కొన్నారు.
టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘు రామ కృష్ణ రాజు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ చిరస్మరణీయంగా జీవించి ఉంటారని అన్నారు. ఎన్టీఆర్ కు భారతరత్న నిజమైన గౌరవంగా భావిస్తున్నామని, ఆయనకు భారతరత్న ఇవ్వడం వల్ల భారతరత్నకే గౌరవం వస్తుందని పేర్కొన్నారు. ఈ ఏడాది అది నిజమవుతుందని భావిస్తున్నామని పేర్కొన్నారు.