Hyderabad : ప్లాన్ మారింది.. కేబీఆర్ పార్క్ చుట్టూ వంతెనలు, అండవర్ పాస్‌లు రద్దు? వన్ వే ఫిక్స్.. ఎలివేటెడ్ కారిడార్..
Hyderabad : కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మించాలనుకున్న ఏడు ప్లైఓవర్లు, ఏడు అండర్ పాస్ ల నిర్మాణాల విషయంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
- Harish Thanniru
- Published on- September 18, 2026 / 08:36 AM IST
Hyderabad KBR Park One Way
Hyderabad KBR Park One Way : కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మించాలనుకున్న ఏడు ప్లైఓవర్లు, ఏడు అండర్ పాస్ ల నిర్మాణాల విషయంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాటి నిర్మాణాలను పూర్తిగా రద్దు చేసినట్లు సమాచారం. ప్లై ఓవర్లు, అండర్ పాస్ ల నిర్మాణాల కోసం అమలు చేసిన వన్ వే విధానంతో ట్రాఫిక్ సమస్య తీరడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్టును రీ అలైన్మెంట్ చేయాలని భావిస్తున్నారు. ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లకు బదులుగా ఒకే ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని.. తద్వారా ట్రాఫిక్ సమస్య తీరడంతోపాటు.. ఖర్చు భారీగా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.
జూబ్లీహిల్స్, ఎన్టీఆర్ భవన్ సర్కిల్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు అధికారులు కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్ పాస్ ల నిర్మాణాలను చేపట్టాలని నిర్ణయించారు. నిర్మాణాలను ప్రారంభించడంతో.. ఈనెల ప్రారంభం నుంచి కేబీఆర్ పార్కు చుట్టూ వన్ వే ఏర్పాటు చేశారు. దీంతో ఎన్టీఆర్ భవన్ సర్కిల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వరకు రావాలంటే కేబీఆర్ పార్కు చుట్టూ తిరిగి రావాల్సిన వస్తుంది. ఇలా కేబీఆర్ పార్కు చుట్టూ వన్ వే ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి రావడంతో.. ప్రారంభంలో వాహనదారులు, ప్రయాణికులు కాస్త ఇబ్బందిపడినా.. తరువాత ట్రాఫిక్ సమస్య లేకుండా నేరుగా ప్రయాణించే అవకాశం లభించింది. అయితే, దూరం ఎక్కువ కావటం మాత్రం వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది. కేబీఆర్ పార్కు చుట్టూ వన్ వే విధానంతో ట్రాఫిక్ సమస్యకు చెక్ పడటంతో.. అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
అధికారుల కొత్త ప్రతిపాదనల ప్రకారం.. పార్క్ చుట్టూ ఏడు ఫ్లై ఓవర్లు, ఏడు అండర్‌పాస్‌లకు బదులుగా ఒకే ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. నాగార్జున సర్కిల్(ఎన్ఎఫ్ సీ) నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు రెండు వైపులా వాహనాలు రాకపోకలు సాగించేలా ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని ప్లాన్ చేశారు. రీ- అలైన్మెంట్‌తో ప్రాజెక్టు వ్యయం స్వల్పంగా తగ్గడంతోపాటు భూసేకరణకు వెచ్చించే ఖర్చు భారీగా తగ్గనుంది. ఇప్పటికే నిర్మాణాలకోసం తవ్విన గుంతలను లెవల్ చేసి వన్ వేకి మరింత ఈజీగా ఉండేలా రోడ్డు నిర్మించనున్నారు.
నాగార్జున సర్కిల్(ఎన్ఎఫ్ సీ) నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు రెండు వైపులా వాహనాలు రాకపోకలు సాగించేలా ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని అధికారులు ప్లాన్ చేశారు. దీంతో సికింద్రాబాద్, బేగంపేట, పంజాగుట్ట వైపు నుంచి జూబ్లీహిల్స్ మీదుగా మాదాపూర్, హైటెక్ సిటీ, ఐటీ కారిడార్ వైపు వెళ్లే వాహనాలు ఈ రూట్లో ప్రయాణించాల్సి ఉంటుంది. అలాగే బంజారాహిల్స్‌రోడ్ నంబర్ 10 నుంచి నాలెడ్జ్ సిటీ వెళ్లేందుకు ఇప్పటికే హెచ్ఎండీఏ ఎలివేటెడ్ కారిడార్ కోసం టెండర్లు కూడా పిలిచింది. దీనిద్వారా బంజారాహిల్స్ రోడ్ నంబర్- 10 నుంచి రోడ్ నంబర్ 12, ఏసీబీ ఆఫీసు మీదుగా నాలెడ్జ్‌సిటీ వైపు వెళ్లొచ్చు. బంజారాహిల్స్‌నుంచి శిల్పా లేఅవుట్ వరకు సుమారు తొమ్మిది కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ కారిడార్‌కు రూ.1,656 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.
ఈ రెండు ఎలివేటెడ్ కారిడార్లు అందుబాటులోకి వస్తే కేబీఆర్ చుట్టూ ఉన్న ప్రధాన జంక్షన్లపై ట్రాఫిక్ సమస్య తగ్గే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. హెచ్-సిటీ పనులు చేపడుతున్న మెగా సంస్థకు బల్దియా ఇప్పటికే మార్పులపై సమాచారం ఇచ్చింది. దీంతో సంబంధిత పనులు కొద్ది రోజుల క్రితం నిలిచిపోయాయి.
