Vehicle Scrapping Policy : మీ ఇంట్లో 15ఏళ్ల పాత వాహనం ఉందా? స్క్రాప్ చేస్తే నగదు, ట్యాక్స్‌లో భారీ ప్రయోజనం!
Old Vehicle Scrapping Benefits : పాత వాహనాలను స్క్రాప్ చేస్తే వాహనదారులకు నగదుతో పాటు కొత్త వాహనం కొనుగోలుపై పన్ను రాయితీ పొందే అవకాశం ఉంది.
- Harish Thanniru
- Updated on- August 18, 2026 / 01:35 PM IST
old vehicle scrapping benefits cash tax rebate
Old Vehicle Scrapping Benefits : జీవితకాలం ముగిసిన పాత వాహనాలతో తరచూ మరమ్మతులు, అధిక నిర్వహణ ఖర్చులు, కాలుష్యం వంటి సమస్యలు తప్పవు. అలాంటి వాహనాలను స్క్రాప్ చేస్తే వాహనదారులకు నగదుతో పాటు కొత్త వాహనం కొనుగోలుపై పన్ను రాయితీ పొందే అవకాశం ఉంది. అయితే, వాహన స్క్రాపింగ్ పాలసీ కింద ఎన్ని ఏళ్లకు స్క్రాప్ చేయాలి? ఎంత ప్రయోజనం పొందొచ్చు? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
Also Read : Gold Silver Price Today : బంగారం, వెండి ధరల్లో ఊహించని మార్పులు.. ఎందుకిలా జరుగుతోంది.. నేటి రేట్లు ఇవే..
జీవిత కాలం ముగిసిన వాహనాలతో వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. తరచూ మరమ్మతులు చేయించాల్సి రావడం, అధిక నిర్వహణ ఖర్చులు, ఎక్కువ ఇంధన వినియోగంతో పాటు కాలుష్య ఉద్గారాలు కూడా పెరుగుతాయి. ఈ సమస్యలకు పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛంద వాహన స్క్రాపింగ్ పాలసీని తీసుకొచ్చింది. పాత, కాలుష్యకారక వాహనాలను శాస్త్రీయంగా తొలగించి రీసైక్లింగ్ చేయడంతోపాటు.. వాహన యజమానులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించడం ఈ విధానం లక్ష్యం.
ఎన్ని సంవత్సరాల తర్వాత స్క్రాప్ చేయాలి?
వాహన రకాన్ని బట్టి స్క్రాపింగ్‌కు గడువు ఉంటుంది. క్యాబ్, బస్సు, ఆటో వంటి రవాణా వాహనాలను 8 ఏళ్లు పూర్తయిన తర్వాత స్క్రాప్ చేయవచ్చు. ఇక కారు, ద్విచక్ర వాహనం వంటి వ్యక్తిగత వాహనాలను 15 ఏళ్లు దాటిన తర్వాత స్క్రాప్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రైవేటు వ్యక్తిగత, రవాణా వాహనాలకు స్క్రాపింగ్ ప్రక్రియ స్వచ్ఛందంగా ఉంటుంది. అయితే ప్రభుత్వ వాహనాల విషయంలో నిబంధనలు కఠినంగా ఉంటాయి. ఆర్టీసీ బస్సులు, ప్రభుత్వ కార్యాలయాల్లో వినియోగించే కార్లు, ఇతర ప్రభుత్వ వాహనాలు 15 ఏళ్లు పూర్తయిన తర్వాత వినియోగించడానికి వీల్లేదు.
స్క్రాప్ చేస్తే నగదు..
పాత వాహనాన్ని రిజిస్టర్డ్ వెహికిల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ కేంద్రానికి అప్పగిస్తే.. వాహనం విలువను అంచనా వేసి స్క్రాప్ విలువను నిర్ణయిస్తారు. అనంతరం వాహన యజమానికి సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఈ సర్టిఫికెట్ ఆధారంగా కొత్త వాహనం కొనుగోలు చేసే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. మోటార్ వెహికల్ ట్యాక్స్‌లో రాయితీ పొందే అవకాశం ఉంటుంది. స్క్రాప్ చేసిన వాహనంలోని మెటల్, స్పేర్ పార్ట్స్ తదితరాల విలువకు అనుగుణంగా నగదు కూడా లభిస్తుంది.
పాత వాహనాలకు సంబంధించిన గ్రీన్ ట్యాక్స్, జరిమానాలు లేదంటే ఇతర బకాయిలు ఉన్న సందర్భాల్లో కూడా స్క్రాపింగ్ విధానం ద్వారా నిబంధనలకు అనుగుణంగా మినహాయింపు లేదా సెటిల్‌మెంట్ ప్రయోజనాలు లభించే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రయోజనాలు రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు, సంబంధిత అధికారుల నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయి.
తెలంగాణలో రంగారెడ్డి జిల్లా కొత్తూరు, సిద్ధిపేట జిల్లా వర్గల్, సంగారెడ్డి జిల్లా పాశమైలారం ప్రాంతాల్లో రిజిస్టర్డ్ వాహన స్క్రాపింగ్ ఫెసిలిటీ కేంద్రాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలో కూడా వాహన స్క్రాపింగ్ కేంద్రాలు ఉన్నాయి.
