Hyderabad Traffic Diversion : కేబీఆర్ పార్కు చుట్టూ వన్-వే అమల్లోకి.. ఈ ప్రాంతాలకు వెళ్లేవారికి ప్రత్యామ్నాయ మార్గాలివే..
Hyderabad Traffic Diversion : హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్. కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.
- Harish Thanniru
- Updated on- August 18, 2026 / 01:03 PM IST
Hyderabad KBR Park One Way Traffic System Implemented
Hyderabad Traffic Diversion : హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్. కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. పార్కు చుట్టూ అండర్ పాస్ ప్లైఓవర్ల నిర్మాణం నేపథ్యంలో వన్-వే అమల్లోకి తీసుకొచ్చారు. అండర్ పాస్ ప్లైఓవర్ల నిర్మాణం పూర్తయ్యే వరకు వన్-వే అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. దాదాపు రెండేళ్ల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి ఉంటాయని చెప్పారు.
Also Read – CM Revanth Reddy : నల్లమలకు వెళ్లి అలా చేయండి.. కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి సూచన.. కేటీఆర్‌పై కీలక కామెంట్స్..
హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న H-CITI ప్రాజెక్ట్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు, కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే ట్రాఫిక్ విధానం అమల్లోకి వచ్చింది. కేబీఆర్ పార్క్ చుట్టూ 360 డిగ్రీల వన్ వే అమలులో ఉంటుంది. వాహనదారులు ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సూచిక బోర్డులను గమనించి నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే లేన్ మారాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
నిర్ణీత మార్గాలు, ఫ్రీ-లెఫ్ట్ సదుపాయాలను వినియోగించుకోవాలని, రాంగ్-సైడ్ డ్రైవింగ్ చేయవద్దని, ముఖ్యంగా రాత్రి, తెల్లవారుజామున ట్రాఫిక్ తక్కువగా ఉన్న సమయంలో అతివేగంతో ప్రయాణించవద్దని, ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ, విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ సూచించారు.
వాహనదారులు ఇబ్బందులు పడకుండా వన్-వే లూప్ నుంచి బయటకు వెళ్లి ఇతర ప్రధాన రహదారుల్లోకి ప్రవేశించడానికి 13 ఎగ్జిట్ పాయింట్లు, 10 లైన్ఛేంజర్లను ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేశారు. చుట్టూ ప్రయాణించేటప్పుడు దారి మారడానికి కేవలం ఈ 10 ప్రాంతాల్లో మాత్రమే అనుమతి ఉంటుంది. పార్కు చుట్టూ నిర్దిష్ట యూ-టర్న్‌లు, ఎగ్జిట్ పాయింట్లతో కూడిన కొత్త వన్ -వే రూట్ మ్యాప్‌ను గూగుల్ మ్యాప్స్‌లో సవరించారు. ప్రయాణానికి ముందు గూగుల్ మ్యాప్స్ ద్వారా సరిచూసుకొని వాహనదారులు వెళ్లాల్సిన ప్రాంతాలకు చేరుకోచవచ్చు.
పంజాగుట్ట నుంచి మాదాపూర్ వైపు..!
పంజాగుట్ట నుంచి మాదాపూర్ వైపు వెళ్లే వాహనదారులు ఎన్టీఆర్ భవన్ సిగ్నల్ వద్ద ఎడమవైపు తిరిగి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి, మహారాజా అగ్రసేన్ చౌరస్తా, జర్నలిస్టు కాలనీ మీదుగా రోడ్ నంబర్ 45కు చేరుకోవచ్చు. అక్కడి నుంచి మాదాపూర్ వైపు వెళ్లే అవకాశం ఉంటుంది. మరో మార్గంగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి ఎడమవైపు తిరిగి నిర్దేశించిన రూట్‌ను ఉపయోగించుకోవచ్చు.
అమీర్ పేట నుంచి ఫిలింనగర్ వెళ్లాలంటే..
అమీర్ పేట్ నుంచి ఫిలింనగర్ వెళ్లాలంటే.. ఇంతకుముందు జూబ్లీచెక్ పోస్టు మీదుగా నేరుగా వెళ్లే అవకాశం ఉండేది. కానీ, ప్రస్తుతం మార్పుల్లో భాగంగా.. జూబ్లీపోస్టు చెక్ పోస్టు నుంచి ఎడమవైపు టీడీపీ కార్యాలయం రోడ్దువైపు వెళ్లాలి.. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్దకు వెళ్లాక బీఆర్ఎస్ భవన్‌కు వెళ్లే రోడ్డుకు మళ్లాలి.. అక్కడ నుంచి నేరుగా పాత రూట్‌లోనే ఫిల్మ్‌నగర్ కు చేరుకోవచ్చు.
అమీర్ పేట్ నుంచి హైటెక్ సిటీ వెళ్లాలంటే ఎలా?
అమీర్‌పేట్ నుంచి హైటెక్ సిటీ, పెద్దమ్మతల్లి టెంపుల్ వైపు వెళ్లేవారు.. ఇకనుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు ద్వారా వెళ్లలేరు. అమీర్‌పేట్, యూసూఫ్‌గూడ నుంచి వెళ్లేటప్పుడు డోమినోస్ ఫిజా సెంటర్ దాటి ముందుకెళ్లిన తరువాత ఎడమవైపు రోడ్డుకు తిరగాలి. అక్కడ నుంచి నేరుగా వెళ్తే.. హైటెక్ సిటీ వెళ్లే రోడ్డుకు చేరుకుంటారు. పెద్దమ్మ తల్లి గుడి, హైటెక్ సిటీకి ఈ మార్గంలో వెళ్లొచ్చు.
హైటెక్ సిటీ నుంచి ఫిలింనగర్ ఎలా వెళ్లాలి?
హైటెక్ సిటీ నుంచి ఫిలింనగర్ వెళ్లాలంటే.. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు మీదుగా టీడీపీ కార్యాలయం, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి, మహారాజా అగ్రసేన్ చౌరస్తా, జర్నలిస్టు కాలనీ మీదుగా రోడ్ ఫిలింనగర్ వెళ్లిచ్చు.
ఫిలింనగర్ నుంచి పంజాగుట్ట..
ఫిలింనగర్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్లాలంటే ఎలాంటి మార్పులు లేవు. గతంలోలా జూబ్లీహిల్స్ చెక్ పోస్టు నుంచి ఎన్టీఆర్ భవన్ వద్ద ఎడవైపు రోడ్డు నుంచి పంజాగుట్ట వెళ్లొచ్చు.
