Hair In Stomach : బాలిక కడుపులో 2 కిలోల వెంట్రుకలు…ప్రాణం కాపాడిన వైద్యులు

ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు బాలిక కడుపులో ఉన్న 2 కిలోల వెంట్రుకలు తొలగించి  ఆమె  ప్రాణాలు కాపాడారు.

Hair In Stomach : ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు బాలిక కడుపులో ఉన్న 2 కిలోల వెంట్రుకలు తొలగించి  ఆమె  ప్రాణాలు కాపాడారు.  ప్రపంచంలో ఇది 68వ కేసుగా వైద్యులు తెలిపారు. వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ గగన్‌పహాడ్‌కు చెందిన పూజిత (17) అనే బాలిక గత ఐదునెలలుగా వెంట్రుకలు తింటోంది. అవి కడుపులో పేరుకుపోయి మూడు నెలలుగా కడుపనొప్పి వాంతులతో బాధపడుతోంది.

ఆమె అనారోగ్యాన్ని గుర్తించిన సోదరి బాలికను గతనెల 24న ఉస్మానియా ఆస్పత్రికి  తీసుకు వచ్చి పరీక్షలు చేయించింది. ఆ సమయంలో బాలికకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వైద్యులు ఆమెను హోం ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందించారు.  31న కోలుకోవటంతో అదే రోజు ఆస్పత్రిలో చేర్చుకుని పొట్టకు స్కానింగ్ చేసి లోపల వెంట్రుకలను గుర్తించారు.

అవి కడుపులో జీర్ణాశయం నుంచి చిన్నపేగు వరకు  ముద్దగా పేరుకుపోయినట్లు తేలింది. జూన్ 2న శస్త్రచికిత్సనిర్వహించి బాలిక కడుపులో ఉన్న సుమారు 2కిలోల వెంట్రుకలు తొలగించారు.  సరైన సమయంలో ఆస్పత్రికి తీసుకువచ్చారని… ఆపరేషన్ చేయటంతో బాలికకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు చెప్పారు. ఆపరేషన్ అనంతరం పూజిత ఆరోగ్యం కుదుటపడటంతో శుక్రవారం డిశ్చార్జ్ చేసారు.

ట్రెండింగ్ వార్తలు