Gajwel - BJP Applications
Gajwel – BJP Applications : బీజేపీ కార్యాలయంలో మూడో రోజు ఎమ్మెల్యే ఆశావహుల నుండి దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. ఇవాళ(సెప్టెంబర్ 6) మంచి ముహూర్తం ఉందని టికెట్ ఆశిస్తున్న వారు పోటీ పడ్డారు. మూడు క్యూ లైన్స్ ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించింది కమిటీ. మరోవైపు గోషామహల్ టికెట్ కోసం విక్రమ్ గౌడ్ దరఖాస్తు చేసుకున్నారు.
ఎమ్మెల్యే రాజాసింగ్ పై బీజేపీ సస్పెన్షన్ కొనసాగుతోంది. దీంతో గోషామహల్ టికెట్ కు ప్రాధాన్యత పెరిగింది. మహేశ్వరం టికెట్ కోసం అందెల శ్రీరాములు యాదవ్, గజ్వేల్ టిక్కెట్ కోసం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు సురేశ్ యాదవ్ దరఖాస్తు చేసుకున్నారు.
రాజాసింగ్ పై సస్పెన్షన్ ఉండటంతో.. ఆ స్థానం తనకు ఇవ్వాలని విక్రమ్ గౌడ్ అప్లికేషన్ పెట్టుకున్నారు. గోషామహల్ టికెట్ ఎవరికి కేటాయిస్తారు అనేది ఇటు బీజేపీ శ్రేణుల్లో అటు రాజకీయవర్గాల్లో కొంత ఆసక్తికరంగా మారింది. ఇక, గజ్వేల్ లో సీఎం కేసీఆర్ పై నేను పోటీ చేస్తానంటూ ఓయూ విద్యార్థి నేత సురేశ్ యాదవ్ అప్లికేషన్ పెట్టుకున్నారు. గజ్వేల్ టికెట్ తనకివ్వాలని సురేశ్ యాదవ్ కోరుతున్నారు. కాగా, సీనియర్లు ఎవరూ ఇవాళ దరఖాస్తు చేసుకోలేదు. దీనిపై ప్రకాశ్ జవదేకర్ కొంత అసహనం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ కావాలంటే కచ్చితంగా సీనియర్లు కూడా జాతీయ స్థాయి నేతలు అయినా రాష్ట్ర స్థాయి నేతలైనా అప్లికేషన్ పెట్టుకోవాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు.