Azharuddin: జూబ్లీహిల్స్ టిక్కెట్ కోసం అజరుద్దీన్‌ గట్టి ప్రయత్నాలు.. విష్ణు పరిస్థితి ఏంటి?

అజహర్ ఓ ప్లాన్ ప్రకారం పావులు కదిపి.. విష్ణు వ్యతిరేకులను అంతా తనకు అనుకూలంగా మార్చుకుని జూబ్లీహిల్స్‌లో పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారని చెబుతున్నారు.

Azharuddin: జూబ్లీహిల్స్ టిక్కెట్ కోసం అజరుద్దీన్‌ గట్టి ప్రయత్నాలు.. విష్ణు పరిస్థితి ఏంటి?

Azharuddin Eyes Jubilee Hills For His Assembly Debut in Telangana

Azharuddin Jubilee Hills : జూబ్లీహిల్స్ రాజకీయాలు రక్తికట్టిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్‌రెడ్డి (Vishnuvardhan Reddy) టార్గెట్‌గా కాంగ్రెస్‌లో ఓ వర్గం చురుగ్గా పావులు కదుపుతోంది. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజరుద్దీన్‌ను జూబ్లిహిల్స్‌ బరిలో దింపాలని ప్లాన్ చేయడమే కాకుండా ఈ సీటు ఆశిస్తున్న విష్ణువర్దన్‌రెడ్డికి చెక్ చెప్పేలా కసరత్తు జరుగుతోంది. పార్టీలో ప్రత్యర్థులతోపాటు సొంతం కుటుంబ సభ్యులు కూడా మాజీ ఎమ్మెల్యే విష్ణును వ్యతిరేకిస్తుండటంతో.. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ రాజకీయం (Telangana Congress) రసవత్తరంగా మారుతోంది. జూబ్లీహిల్స్ టిక్కెట్ కోసం అజ్జూ భాయ్ శరవేగంగా ప్రయత్నాలు చేస్తుండగా.. విష్ణు మాత్రం టిక్కెట్ తనదేనంటూ ధీమా ప్రదర్శిస్తున్నారు. ఇంతకూ విష్ణుకు టిక్కెట్ దక్కుతుందా? అజహర్ ప్లాన్ ఏంటి? తెరవెనుక రాజకీయం ఎలా ఉంది?

కాంగ్రెస్ మార్క్ రాజకీయానికి హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం వేదికవుతోంది. ఒకప్పుడు ఖైతరాబాద్ నియోజకవర్గం పరిధిలో ఉన్న జూబ్లీహిల్స్‌లో మాజీ మంత్రి పి.జనార్దన్‌రెడ్డి-PJR కుటుంబానికి గట్టి పట్టు ఉంది. పీజేఆర్ మరణం తర్వాత 2008లో ఖైరతాబాద్ నుండి ఉప ఎన్నికలో విజయం సాధించిన విష్ణువర్దన్ రెడ్డి… ఆ తర్వాత 2009లో జూబ్లీహిల్స్ నుండి సైతం గెలుపొందారు. ఐతే రాష్ట్ర విభజన అనంతరం గత రెండుసార్లు బీఆర్‌ఎస్ నేత మాగంటి గోపీనాథ్ చేతిలో ఓడిపోయారు విష్ణువర్దన్‌రెడ్డి. కానీ తన త్వరలో జరగబోయే ఎన్నికల్లో మరోసారి పోటీ చేసి అదృష్టం పరీక్షించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు విష్ణు.

గత రెండు ఎన్నికల్లో ఓడిపోవడం.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉండటంతో జూబ్లీహిల్స్ అభ్యర్థిని మార్చాలని చూస్తోంది కాంగ్రెస్ పార్టీ. మైనార్టీ నేత, మాజీ క్రికెటర్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజరుద్దీన్‌ను తెరపైకి తెచ్చింది. గతంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో ఒకటి రెండు చోట్ల పర్యటించిన అజ్జూ భాయ్ కార్యకర్తలతో చాయ్ పే చర్చ కార్యక్రమంలో ఇష్టాగోష్టి నిర్వహించారు. ఆ సమయంలో విష్ణు మద్దతుదారుల నుంచి వ్యతిరేకత రావడంతో కాస్త వెనక్కి తగ్గారు. కానీ ఏమైందో ఏమో మళ్లీ ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచే పోటీ అంటూ ప్రకటనలు చేస్తున్నారు అజ్జూ భాయ్.

Also Read: షర్మిల కన్నా తుమ్మలనే బెస్ట్ అప్షన్.. తెలంగాణ కాంగ్రెస్ లో మారిపోతున్న సమీకరణాలు!

టిక్కెట్ తనదేనంటూ నమ్మకంతో ప్రచారం చేసుకుంటున్న మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్‌రెడ్డికి షాకిస్తున్నారు అజరుద్దీన్. హైకమాండ్‌లో అజహర్‌కు మంచి పట్టు ఉండటం.. విష్ణు వ్యతిరేకులు అంతా మూకుమ్మడిగా అజహర్‌కే మద్దతు ఇస్తుండటంతో జూబ్లిహిల్స్ రాజకీయం వాడివేడిగా మారింది. ముఖ్యంగా సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్‌తోపాటు విష్ణు ప్రధాన అనుచరుడు భవానీశంకర్ కూడా అజహర్‌కే జై కొడుతున్నారు. ఈ ఇద్దరితోపాటు విష్ణుకు మింగుడు పడని విధంగా ఆయన సొంత సోదరి విజయారెడ్డి కూడా అజహర్‌కు అండగా నిలుస్తున్నారట.. ఈ పరిణామాలతో కంగుతిన్న విష్ణు.. భవిష్యత్ ప్రణాళికపై కార్యకర్తలతో చర్చిస్తున్నట్లు సమాచారం.

Also Read: కేసీఆర్ నిర్ణయంలో మార్పు ఉండదు, కష్టపడి పని చేసిన వారికి అవకాశాలు వస్తాయి

పీజేఆర్ తనయుడిగా విష్ణువర్దన్‌రెడ్డికి గుర్తింపు ఉన్నా.. గత రెండు ఎన్నికల్లో ఓటమి సాకుగా చూపి ఆయన్ను తప్పించే ప్రయత్నం జరుగుతోందని అంటున్నారు. జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో మైనార్టీలు ఎక్కువగా ఉండటం వల్ల అజహర్ సరైన అభ్యర్థి అవుతారని ఆయన ప్రత్యర్థులు ప్రచారం చేయడాన్ని విష్ణు తిప్పికొట్టలేకపోతున్నారు. ఇదే సమయంలో ఖైరతాబాద్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్న విజయారెడ్డి.. జూబ్లీహిల్స్ టిక్కెట్ విష్ణుకు ఇస్తే.. ఎక్కడ తనకు చాన్స్ మిస్ అవుతుందోననే ముందుచూపుతో అజహర్‌కి మద్దతు ఇస్తున్నట్లు చెబుతున్నారు. వన్ ఫ్యామిలీ.. వన్ టిక్కెట్ కండీషన్‌తో తన సీటుకు ఎసరు రాకుండా విజయారెడ్డి జాగ్రత్త పడుతుంటే.. విష్ణు లైట్‌గా తీసుకోవడం ఆయనకే ముప్పు తెచ్చిపెట్టిందనే వాదన వినిపిస్తోంది. ఏదైనా సరే అజహర్ ఓ ప్లాన్ ప్రకారం పావులు కదిపి.. విష్ణు వ్యతిరేకులను అంతా తనకు అనుకూలంగా మార్చుకుని జూబ్లీహిల్స్‌లో పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో విష్ణు ఎలా రియాక్ట్ అవుతారు? ఆయన భవిష్యత్ ప్లాన్ ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది.