×
Ad

Party Defections Case : పార్టీ ఫిరాయింపుల కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. ఎమ్మెల్యే దానంకు నోటీసులు

Party Defections Case : తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Party Defections Case

Party Defections Case : తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారం నోటీసులు ఇచ్చారు. ఈనెల 30వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అదేవిధంగా దానం నాగేందర్‌పై అనర్హత పిటిషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డికిసైతం స్పీకర్ నోటీసులు జారీ చేశారు. 30వ తేదీన వారు కూడా విచారణకు రావాలని పేర్కొన్నారు.

Also Read : Gold and Silver Rates Today : బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..

పార్టీ ఫిరాయింపు కేసులో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఫిర్యాదులు అందగా.. వారిలో అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్ , ప్రకాశ్ గౌడ్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్యలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. వీరిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తించారు. అయితే, దానం నాగేందర్, కడియం శ్రీహరి, డాక్టర్ సంజయ్ లకు సంబంధించి స్పీకర్ ఇంకా విచారణ జరపలేదు.

దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే 2024 సార్వత్రిక ఎ్ననికల్లోకాంగ్రెస్ పార్టీ బీఫామ్ పై ఎంపీగా పోటీ చేశారు. దీంతో ఆయన పార్టీ ఫిరాయించారనడానికి బలమైన ఆధారాలున్నాయి. ఈ నేపథ్యంలో నాగంపై స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారని ఆసక్తికరంగా మారింది. మరోవైపు.. స్పీకర్ తనపై చర్యలు తీసుకోకముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బైఎలక్షన్ కు వెళ్లే ఆలోచనలో దానం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.

మరోవైపు.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విషయంలో చేస్తున్న జాప్యంపై ఈనెల 19వ తేదీన స్పీకర్ కు సుప్రీంకోర్టు ధిక్కర నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్లపై చర్యలు తీసుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ధర్మాసనం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ కు స్పీకర్ నోటీసులు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.

బీఆర్ఎస్ కి రాజీనామా చేయలేదు- దానం నాగేందర్

బీఆర్‌ఎస్ అనర్హత పిటిషన్‌పై ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారన్న పిటిషన్‌ను కొట్టి వేయాలని స్పీకర్‌కు దానం నాగేందర్‌ విజ్ఞప్తి చేశారు. తాను బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయలేదని తెలిపారు. బీఆర్‌ఎస్‌ తనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు తనకు సమాచారం లేదన్నారు. 2024 మార్చిలో కాంగ్రెస్‌ సమావేశానికి వెళ్లానని వెల్లడించారు. కాంగ్రెస్‌ పార్టీ సమావేశానికి వ్యక్తిగత హోదాలో వెళ్లినట్లు దానం నాగేందర్‌ స్పష్టతనిచ్చారు. మీడియా కథనాల ఆధారంగా తాను పార్టీ మారినట్లు బీఆర్‌ఎస్‌ భావిస్తోందన్నారు. కాగా, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీ-ఫామ్ పై పోటీ చేసిన విషయాన్ని మాత్రం దానం నాగేందర్ తన అఫిడవిట్ లో ప్రస్తావించలేదు.