బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

తాను కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు గూడెం మహిపాల్ రెడ్డి తన అనుచరులకు ఫోన్ చేసి చెప్పారు.

Mla Gudem Mahipal Reddy : బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరారు. పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన హస్తం గూటికి చేరారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ముఖ్యమంత్రి రేవంత్. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నేత గాలి అనిల్ కుమార్ కాంగ్రెస్ లో చేరారు.

తాను కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు గూడెం మహిపాల్ రెడ్డి తన అనుచరులకు ఫోన్ చేసి చెప్పారు. వస్తే తనతో పాటు కాంగ్రెస్ లోకి రావాలని, లేకపోతే మీ ఇష్టం అంటూ తన అనుచరులకు స్పష్టం చేశారు మహిపాల్ రెడ్డి.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను వరుసగా కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ శాసనసభా పక్షాన్ని విలీనం చేసుకునే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు 9మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు మహిపాల్ రెడ్డి చేరికతో ఆ సంఖ్య 10కి చేరింది. మొత్తం 26మంది చేరితే బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కానుంది. బడ్జెట్ సమావేశాల లోపు ఆ 26మందిని పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది.

పటాన్ చెరు ఎమ్మెల్యేతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరిగింది. అయితే, ప్రస్తుతానికి గూడెం మహిపాల్ రెడ్డి మాత్రమే పార్టీలో చేరారు.  వాస్తవానికి గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు దాదాపుగా 20 రోజుల నుంచి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఆయన ఢిల్లీ కూడా వెళ్లారు. ఢిల్లీ పెద్దల సమక్షంలో కాంగ్రెస్ లో చేరాలని వెళ్లినా.. జిల్లాకు సంబంధించిన కొన్ని సమీకరణాలు కుదరకపోవడంతో ఆయన చేరిక వాయిదా పడుతూ వచ్చింది. ముఖ్యంగా జిల్లాకు చెందిన మంత్రి దామోదర రాజనర్సింహ అంగీకారం లేకపోవడంతో మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిక ఇప్పటివరకు వాయిదా పడుతూ వచ్చింది.

అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో మహిపాల్ రెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకోవడం తప్పనిసరి అని మంత్రి దామోదరకు నచ్చచెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పటాన్ చెరుకు సంబంధించి ఇద్దరు బలమైన నేతలు కాంగ్రెస్ లో ఉన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన నీలం మధు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన శ్రీనివాస్ గౌడ్… కాంగ్రెస్ లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తే గ్రూపు తగాదాలు వస్తాయనే ఆలోచనలో ఇప్పటివరకు మహిపాల్ రెడ్డి చేరికను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ఎమ్మెల్యే వచ్చినా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. దాంతో మహిపాల్ రెడ్డి చేరికకు లైన్ క్లియర్ అయ్యింది.

Also Read : గుడ్‌న్యూస్.. పంటల రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం

 

ట్రెండింగ్ వార్తలు