కేంద్ర ప్రభుత్వానికి ఈ విజ్ఞప్తులు చేసిన తెలుగు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు

GST Council meet: ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది.

కేంద్ర బడ్జెట్ సన్నాహక సమావేశం, 53వ జీఎస్టీ మండలి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. అనంతరం పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రానికి ఏం కావాలన్న దానిపై కేంద్రానికి నివేదిక అందజేశానని తెలిపారు.

విభజన వల్ల వచ్చిన ఆర్థిక సవాళ్లను అధిగమించడంతో పాటు ఐదేళ్లలో ఆర్థికపరంగా జరిగిన తప్పులను సరిదిద్దడానికి కేంద్ర సహకారం కావాలని కోరానని పయ్యావుల కేశవ్ అన్నారు. పారిశ్రామిక రాయితీలు, పారిశ్రమిక కారిడార్ల ఏర్పాటుకు సహకారం, ఆక్వా పార్కులు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. అలాగే, గ్రీన్ ఎనర్జీ కారిడార్‌కు మద్దతు కోరినట్లు తెలిపారు.

భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. దేశానికి, తెలంగాణకు ఉపయోగకరమైన సలహాలు, సూచనలు చేశామని అన్నారు. కొత్త పథకాలు ప్రవేశ పెట్టాలని కోరినట్లు తెలిపారు. ఆదాయ అసమానతలు దేశంలో పెరుగుతున్నాయని అన్నారు. వాటిని తగ్గించేలా కేంద్ర బడ్జెట్ ఉండాలని సూచించినట్లు తెలిపారు.

సర్ చార్జీలు 10 శాతం మించకుండా చూడాలని కోరినట్లు భట్టి విక్రమార్క చెప్పారు. విభజన చట్టం ప్రకారం వెనుకబడిన జిల్లాలకు 2250 కోట్ల రూపాయల పెండింగ్ నిధులున్నాయని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందించాలని కోరామని తెలిపారు.

త్వరలోనే తెలంగాణ క్యాబినెట్ విస్తరణ.. ఈ సీనియర్లు, యువ నేతలకు చోటు!

ట్రెండింగ్ వార్తలు