PCC President Mahesh Kumar Goud: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. గత రెండు నెలల క్రితం వరకు మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని, కేబినెట్ లో కొత్తగా నలుగురైదుగురికి అవకాశం దక్కుతుందని ప్రచారం జరిగింది. మంత్రి వర్గంలోకి తీసుకునేవారి లిస్ట్‌నుసైతం కేంద్ర పార్టీ అధిష్టానం ఫైనల్ చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణపై కేంద్ర పార్టీ పెద్దలతో చర్చించేందుకు పలు దఫాలుగా ఢిల్లీకి వెళ్లారు. కానీ, మంత్రివర్గ విస్తరణ జరగలేదు. దీంతో కొన్నాళ్లుగా మంత్రివర్గ విస్తరణపై ఎలాంటి చర్చలు జరగడం లేదు. తాజాగా.. మళ్లీ మంత్రివర్గ విస్తరణ అంశం తెరపైకి వచ్చింది.
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మంత్రివర్గ విస్తరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ పర్యటనలో ఉన్న ఆయన మంత్రివర్గ విస్తరణ ఈనెలాఖరులో లేదా జూన్ మొదటి వారంలో ఉండే అవకాశం ఉందని చెప్పారు. అయితే, వివిధ సమీకరణాల వల్లే మంత్రివర్గ విస్తరణలో జాప్యం జరుగుతూ వస్తుందని చెప్పారు. మంత్రుల మధ్య విభేదాలు ఉన్నాయని జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందిస్తూ.. మంత్రులంతా కలిసే ఉన్నాం.. కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ప్రజలకు ఉన్న అవసరాలు తీర్చడమే మా ముందున్న లక్ష్యం అని స్పష్టం చేశారు.
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు వక్రీకరించారని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారిపై సైబర్ క్రైమ్ లో కేసులు పెడతామని మహేశ్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. సోషల్ మీడియా అతస్య ప్రచారాలపై మధ్యప్రదేశ్ విధానం అమలు చేస్తామని అన్నారు. ఈనెల 26, 27 తేదీల్లో పీసీసీ కార్యవర్గం ఖరారయ్యే అవకాశం ఉందని అన్నారు. సీఎం మార్పు ప్రతిపక్షాల తప్పుడు ప్రచారం అని, బీఆర్ఎస్‌లో మూడు ముక్కలాట నడుస్తుందని మహేశ్ గౌడ్ అన్నారు. మహిళా కాంగ్రెస్ ఆందోళన సర్వసాధారణం.. మహిళలకు కాంగ్రెస్ లో ఉన్న ప్రాధాన్యం మరే పార్టీలో లేదని మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు.