Peddi Sudarshan Reddy : బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత
Peddi Sudarshan Reddy Passes Away : బీఆర్ఎస్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడి గురువారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు.
- Harish Thanniru
- Updated on- July 31, 2026 / 10:39 AM IST
Former Narsampet MLA Peddi Sudarshan Reddy Passes Away at 51
BRS Peddi Sudarshan Reddy: బీఆర్ఎస్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. ఈనెల 26న ఉదయం హనుమకొండలో ఆయనకు గుండెపోటు రావడంతో స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు. ఐదు రోజులపాటు మృత్యువుతో పోరాడి గురువారం అర్ధరాత్రి 12.50గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి చెందినట్లు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి వైద్యులు అధికారికంగా ప్రకటించారు.
Also Read : Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. నిరుద్యోగులకు శుభవార్త.. స్వయం ఉపాధి కల్పించేలా..
1974 ఆగస్టు 6న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నల్లబెల్లిలో రైతు కుటుంబంలో జన్మించిన పెద్ది సుదర్శన్‌రెడ్డి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పనిచేశారు. 2001లో టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్)లో చేరిన సుదర్శన్ రెడ్డి.. అదేఏడాది నల్లబెల్లి జడ్పీటీసీ సభ్యుడిగానూ ఎన్నికయ్యారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 2015లో తెలంగాణ పౌర సరఫరాల సంస్థ రాష్ట్ర ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2018లో నర్సంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతితో బీఆర్‌ఎస్ శ్రేణుల్లో విషాదం నెలకొంది. పలువురు పార్టీ నేతలు ఆయన మృతిపట్ల సంతాపం ప్రకటించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మృతిపట్ల మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన సంతాపాన్ని ప్రకటించారు. ఉద్యమ సహచరుడిని, ఆప్త మిత్రున్ని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేస్తూ పెద్ది మరణం పట్ల కేసీఆర్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులు పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి బీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ రాష్ట్రంకు తీరనిలోటు అని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
