Petition On Hydra : హైడ్రాపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. జీవో 99ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ సమర్థుడు కాదని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై విచారించిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.
హైదరాబాద్ నగరంలో చెరువుల పరిరక్షణే లక్ష్యంగా హైడ్రా ఏర్పాటైంది. చెరువులు, నాలాల కబ్జాలపై ఫోకస్ చేసిన హైడ్రా.. ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ల పరిధిలోని ఆక్రమణలను తొలగిస్తోంది. ఇప్పటివరకు 23 ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. దాదాపు 262 అక్రమ నిర్మాణాలను కూల్చేసింది. తద్వారా 117 ఎకరాలకుపైగా భూమిని స్వాధీనం చేసుకుంది. చెరువులు, నాలాలు, రోడ్లను కబ్జా చేసి వెలసిన అక్రమ నిర్మాణాలను తొలగించడం ద్వారా మొత్తం 117.2 ఎకరాల భూములు స్వాధీనం అయినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా అమీన్ పూర్ చెరువులో అత్యధికంగా 51 ఎకరాలకుపైగా భూమిని స్వాధీనం చేసుకున్నారు. అనేక ప్రాంతాల్లో 7 ఎకరాలు, 8 ఎకరాల భూములను కూడా స్వాధీనం చేసుకుంది హైడ్రా.
హైడ్రా కూల్చివేతలపై ప్రశంసలే కాదు విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు అక్రమ నిర్మాణాలు అంటున్న అధికారులు.. నాడు వాటి నిర్మాణాలకు ఎలా అనుమతులు ఇచ్చారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. అక్రమమే అయినప్పుడు ఇన్నాళ్లు ఎందుకు ట్యాక్సులు కట్టించుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. నాడు అధికారుల అనుమతి తీసుకునే నిర్మాణాలు చేపట్టామని, నాడు లేని అభ్యంతరం నేడు ఎందుకు వచ్చిందని బాధితులు అడుగుతున్నారు.
Also Read : ఆ ఆరుగురు అదృష్టవంతులు ఎవరు? మంత్రివర్గ విస్తరణకు సీఎం రేవంత్ కసరత్తు..
హైడ్రా కూల్చివేతలకు వ్యతిరేకంగా కొందరు కోర్టును ఆశ్రయించారు. కూల్చివేతలు ఆపేలా హైడ్రాకు ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో పలువురు వ్యక్తులు పిటిషన్లు దాఖలు చేశారు. నోటీసులు ఇవ్వకుండానే తమ ఇళ్లను కూల్చేస్తున్నారని, తాము రోడ్డున పడ్డామని బాధితులు కన్నీటిపర్యంతం అవుతున్నారు.