Petrol Stations Closed : ఇక నుంచి ప్రతి ఆదివారం పెట్రోల్ బంక్‌లు బంద్ కానున్నాయా..? క్లారిటీ ఇదే..

Petrol Stations Closed : ప్రజలు పొదుపు చర్యలు పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఈ క్రమంలో దేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలను దృష్టిలో ఉంచుకొని, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని, మే 14 నుంచి దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులను మూసివేసేలా నిబంధనలు అమలు చేయనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే, ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టమైంది.

Petrol Stations Closed

  • ప్రతి ఆదివారం పెట్రోల్ బంక్‌లు మూతపడబోతున్నాయా?
  • సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం
  • అలాంటిదేమీ లేదని స్పష్టం చేసిన అధికారులు
  • అది పాత వీడియోగా గుర్తింపు

Petrol Stations Closed : పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారతదేశంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. పలు ప్రాంతాల్లో బంక్‌లు మూత పడుతున్న పరిస్థితి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఇటీవల పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా పలు ప్రాంతాల్లో బంక్‌లు మూతపడ్డాయి. పలు ప్రాంతాల్లో బంక్‌ల వద్ద వాహనదారులు బారులు తీరారు. అయితే, ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆ పరిస్థితి లేకపోయినా.. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత వేదిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు కీలక సూచనలు చేశారు.

Also Read : Sugar Exports : కేంద్రం కీలక నిర్ణయం.. ఆ ఎగుమతులు బంద్.. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు భారీ ఊరట

ప్రజలు పొదుపు చర్యలు పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఇంధన వినియోగాన్ని తగ్గించాలని, సొంత వాహనాలకు బదులు కార్ పూలింగ్, ప్రభుత్వ రవాణా వ్యవస్థలను ఉపయోగించుకోవాలని, అలాగే ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని.. ఇలా పలు రకాల సూచనలను ప్రధాని నరేంద్ర మోదీ చేశారు. ఈ క్రమంలో దేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలను దృష్టిలో ఉంచుకొని, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని, మే 14 నుంచి దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులను మూసివేసేలా నిబంధనలు అమలు చేయనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఇక నుంచి ప్రతి ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ బంక్ లు మూతపడతాయని విస్తృత ప్రచారం జరుగుతోంది. అయితే, ప్రచారంలో వాస్తవం లేదని అధికారులు స్ఫష్టం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో పాతదని పేర్కొంటున్నారు.

ఇకనుంచి ప్రతి ఆదివారం పెట్రోల్ బంక్ లు మూతపడతాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నప్పటికీ దీనిపై కేంద్ర పెట్రోలియం శాఖ నుండి గానీ, చమురు సంస్థల నుంచి గానీ ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో ఓ ప్రముఖ తెలుగు ఛానెల్‌‌లో 2017 నాటి పాత వార్తా కథనంకు సంబంధించిన వీడియో. ఏ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆదివారాల్లో పెట్రోల్ బంక్‌లు మూతవేసేలా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

గతంలో మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. చమురు వినియోగాన్ని తగ్గించాలని ప్రజలకు సూచించారు. అప్పట్లో ప్రధాని మోదీ సూచన మేరకు భారత పెట్రోలియం డీలర్ల కన్సార్టియం ఎంపిక చేసిన ఎనిమిది రాష్ట్రాల్లో (తెలుగు రాష్ట్రాలతోపాటు) ఆదివారాల్లో పెట్రోల్ బంకులు మూసివేయాలని ప్రతిపాదించింది. అయితే, ఆ నిర్ణయం అమల్లోకి రాకముందే తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు.