Khairatabad Bada Ganesh: ఖైరతాబాద్ బడా గణేశ్ దర్శనానికి వచ్చే మహిళలను ఇబ్బందులకు గురిచేస్తున్న ఆకతాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు రోజుల వ్యవధిలో 51 మంది ఆకతాయిలను మహిళా విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆధారాలతో 51 మంది ఆకతాయిలను అదుపులోకి తీసుకున్నారు. బడా గణేష్ పరిసర ప్రాంతాల్లో 16 బృందాలుగా మహిళా విభాగం పోలీసుల నిఘా పెట్టారు. ఆకతాయిల వెకిలి చేష్టలను, దృశ్యాలను రికార్డు చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన ఆకతాయిలలో మైనర్లు కూడా ఉన్నారు.
దేవుడి దగ్గర కూడా కొందరు ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. వెకిలి చేష్టలకు పాల్పడుతున్నారు. అమ్మాయిలు, మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. వారిని టచ్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. అలాంటి పోకిరీల తాట తీస్తున్నారు పోలీసులు. ఖైరతాబాద్ బడా గణేష్ కొలువుదీరిన ప్రాంతంలో మహిళా పోలీసులను మోహరిచారు. వారు ఆకతాయిలపై ఓ కన్నేసి ఉంచారు.
బడా గణేశ్ విగ్రహాన్ని చూసేందుకు వచ్చిన మహిళా భక్తులతో అసభ్యంగా ప్రవర్తించే వారిని గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నారు. ఆకతాయిలకు తెలియకుండా వారు చేసే వెధవ పనులను వీడియోలు తీస్తున్నారు. పక్కా ఎవిడెన్స్ తో పోకిరీల పని పడుతున్నారు పోలీసులు.
గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఖైరతాబాద్ లో కొలువుదీరిన వినాయకుడి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. పిల్లలు, పెద్దలు, మహిళలు, పురుషులు భారీగా వస్తున్నారు. ఇదే అదనుగా కొందరు ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
ఈ ఏడాది ఖైరతాబాద్ మహా గణపతి ‘శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి’ అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. స్వామి వారిని దర్శించుకోవడానికి రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. ఖైరతాబాద్ గణపతి ఉత్సవ కమిటీ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. భారీగా వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని క్యూలైన్ల దగ్గర పటిష్టమైన బారికేడ్లు ఏర్పాటు చేశారు. అలాగే భక్తులు ఇబ్బందులు పడకుండా తాగు నీటి సదుపాయం కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందించేందుకు ప్రాథమిక వైద్య సహాయ కేంద్రాలు సైతం ఏర్పాటు చేశారు. ఈ ఏడాది 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో ఖైరతాబాద్ మహా గణపతి కొలువుదీరాడు.