చోరీ కేసులో బిగ్ ట్విస్ట్.. ఇల్లు కట్టాడు.. పెళ్లి చేసుకున్నాడు.. బాత్రూమ్ గ్రిల్స్ తొలగించి..
Jubilee Hills Theft Case : జూబ్లీహిల్స్‌లో ఇటీవల జరిగిన చోరీ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.
- Harish Thanniru
- Updated on- July 23, 2026 / 12:42 PM IST
Jubilee Hills Theft Case
Jubilee Hills Theft Case : జూబ్లీహిల్స్‌లో ఇటీవల జరిగిన చోరీ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. నమ్మకంగా పనిచేస్తూనే తన తమ్ముడి సాయంతో రూ.1.60కోట్ల విలువైన బంగారాన్ని కొట్టేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు 1.029 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
Also Read : TG Paddy Procurement : తెలంగాణకు శుభవార్త చెప్పిన కేంద్ర సర్కార్.. అదనపు ధాన్యం కొనుగోలుకు గ్రీన్‌సిగ్నల్
సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ మీడియాకు ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌కు చెందిన హరీశ్, ఆకాశ్ అన్నదమ్ములు. ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చారు. మంగళ్‌హాట్‌లో స్థిరపడ్డారు. ఆకాశ్ హైటెక్ సిటీలోని ఐటీ కంపెనీలో ఆఫీస్‌బాయ్‌గా పనిచేస్తున్నాడు. 2023 నుంచి హరీశ్ గురుకృప ఎక్స్ పోర్టు సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. సంస్థ తయారు చేసిన బంగారు, వజ్రాభరణాల డిజైన్లను పలు ప్రముఖ బంగారు దుకాణాలకు తీసుకెళ్లేవాడు. వారి ఆర్డర్ తీసుకొని ఖరీదైన ఆభరణాలు, చెక్‌లు భద్రంగా తీసుకొస్తూ యజమాని నమ్మకం చూరగొన్నాడు.
ఇటీవల ఇంటి నిర్మాణం చేపట్టడంతో పాటు పెళ్లి చేసుకోవడంతో హరీశ్ అప్పుల పాలయ్యాడు. నెల జీతంతో కుటుంబ ఖర్చులు, అప్పులు తీర్చడం కష్టంగా మారడంతో నగలు దొంగిలించాలని నిర్ణయించుకున్నాడు. ఈ ప్రణాళికకు తమ్ముడు ఆకాశ్ కూడా సహకరించాడు. సంస్థ మేనేజర్ ముంబై వెళ్లిన సమయంలో అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న హరీశ్.. రాత్రి బాత్రూమ్ గ్రిల్స్ తొలగించి దుకాణంలోకి ప్రవేశించాడు. లాకర్‌లో ఉన్న బంగారు ఆభరణాలను అపహరించి తమ్ముడు ఆకాశ్‌కు అప్పగించాడు.
దుకాణ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించారు. జూబ్లీహిల్స్ టాస్క్ ఫోర్స్ బృందం ఇద్దరినీ అరెస్ట్ చేసి, రూ.1.60 కోట్ల విలువైన 1.029 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
