Eleti Maheshwar Reddy (1)
Maheshwar Reddy Hunger Strike : నిర్మల్ లో బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిరాహార దీక్ష భగ్నం అయింది. మహేశ్వర్ రెడ్డి చేపట్టిన నిరాహార దీక్షను అర్ధరాత్రి దాటాక పోలీసులు భగ్నం చేశారు. నిర్మల్ పట్టణం మాస్టర్ ప్లాన్, జీవో నెంబర్ 220ని రద్దు చేయాలని ఆయన ఐదు రోజుల క్రితం నిరాహార దీక్ష చేపట్టారు. తాజాగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. వైద్య పరీక్షలు చేసేందుకు డాక్టర్ ప్రయత్నిస్తున్నా ఆయన నిరాకరించారు.
దీంతో అర్ధరాత్రి దాటాక పోలీసులు మహేశ్వర్ రెడ్డి దీక్షను భగ్నం చేశారు. అంబులెన్స్ లో ఆయనను నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అంబులెన్స్ లో మహేశ్వర్ రెడ్డిని ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో పోలీసులను బీజేపీ నేతలు అడ్డుకునేందుకు యత్నించగా ఉద్రిక్తత నెలకొంది.
నిర్మల్ మున్సిపాలిటీ కొత్త మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మహేశ్వర్ రెడ్డి ఐదు రోజుల క్రితం దీక్ష చేపట్టారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేశారు. బ్లడ్ ప్రెసర్, షుగర్ లెవల్, పల్స్ రేట్ పడిపోయాయని తెలిపారు. నిరాహార దీక్ష చేస్తే ప్రమాదమని చెప్పారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు.
అయినా వైద్యానికి ఆయన నిరాకరించారు. దీక్ష విరమించేది లేదని, మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేశారు. పోలీసులు బలవంతంగా ఆయనను ఆస్పత్రికి తరలించారు.