గోల్డ్ దొరికింది.. వరదలో కొట్టుకుపోయిన గోల్డ్ బ్యాగ్ కేసుని చేధించిన పోలీసులు

gold bag : వరదలో కొట్టుకుపోయిన గోల్డ్ బ్యాగ్ కేసుని హైదరాబాద్ పోలీసులు చేధించారు. బ్యాగ్ ని అక్కడే వదిలేసి గోల్డ్ ని తీసుకెళ్లిన వ్యక్తిని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. అతడి నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్ 9న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో నగలు మాయమైన కేసు నమోదైంది. జువెలరీ షాప్ కి చెందిన సిబ్బంది ఒకరు కస్టమర్ కోసం బంగారు ఆభరణాలను ఓ బ్యాగ్ లో పెట్టుకుని షాప్ నుంచి స్కూటీపై తీసుకెళ్తుండగా పొరపాటున గోల్డ్ బ్యాగ్ వరదలో కొట్టుకుపోయింది.
కాగా గుడిసెలో నివాసం ఉండే నిరంజన్ అనే వ్యక్తికి బ్యాగ్ దొరికింది. నిరంజన్ బంగారు ఆభరణాలు తీసుకుని బ్యాగ్ ని అక్కడే వదిలేసి నాగర్ కర్నూల్ వెళ్లిపోయాడు. టెక్నాలజీ సాయంతో పోలీసులు నిందితులను గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు నిరంజన్ తో పాటు నలుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 143 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.