సినిమా టికెట్ రేట్ పెంపుపై తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ చేసిన కామెంట్స్‌ను గుర్తు చేస్తూ..గేమ్‌ఛేంజర్ మూవీ టికెట్ రేట్లు ఎందుకు పెంచారో చెప్పాలని ప్రశ్నిస్తోంది అపోజిషన్ బీఆర్ఎస్. దాంతో పాలిటిక్స్ బేస్‌గా వచ్చిన గేమ్‌ఛేంజర్ సినిమా టికెట్ రేట్ల పెంపుపైనే ఇప్పుడు రాజకీయ రచ్చ నడుస్తోంది.
అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటనను రేవంత్ సర్కార్ తుంగలో తొక్కిందంటూ మాజీమంత్రి హరీశ్‌రావు అటాక్ చేశారు. రెండు వారాలు కూడా తిరగక ముందే ఊసరవెల్లి కూడా సిగ్గుపడేలా మాట మార్చారంటూ బీఆర్ఎస్ విమర్శిస్తోంది. అసెంబ్లీలో ప్రకటించిన దానికే విలువ లేకపోతే ఎట్లా అని ప్రశ్నిస్తోంది.
శాసనసభను కూడా తప్పుదోవ పట్టిస్తూ టికెట్ రేట్లు, అదనపు షోలకు అనుమతి ఇవ్వడం సభను అవమానించడమేనన్నారు హరీశ్‌రావు. అసెంబ్లీని తప్పుదోవ పట్టించినందుకు సీఎం రేవంత్‌తో పాటు, మంత్రి కోమటిరెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన కింద ప్రివిలేజ్ మోషన్ పెడతామంటున్నారు. ఇక గేమ్‌ఛేంజర్ మూవీ టికెట్ రేట్ల పెంపు వెనక ఏదో మతలబు ఉందని..రేవంత్ రెడ్డి మూటలు తీసుకుని టికెట్ రేట్ పెంపునకు అనుమతించారని ఆరోపిస్తున్నారు.
కొన్ని వర్గాల నుంచి రేవంత్ సర్కార్‌కు మద్దతు
సంధ్య థియేటర్ ఘటనలో కాంగ్రెస్ ప్రభుత్వం నిక్కచ్చిగా వ్యవహరించినట్లుగా యాక్షన్ తీసుకుంది. సినిమా సెలబ్రెటీలైనా-సామాన్యులైనా చట్టం ముందు అంతా సమానమేనని సీఎం రేవంత్ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చారు. ఈ విషయంలో అపోజిషన్ లీడర్ల విమర్శలు ఎలా ఉన్నా..కొన్ని వర్గాల నుంచి రేవంత్ సర్కార్‌కు మద్దతు లభించింది. టికెట్ రేట్ పెంచబోమని ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చి కూడా ప్రశంసలు పొందారు రేవంత్.
సినీ ప్రముఖులతో భేటీలో కూడా టికెట్ రేట్ విషయంలో తగ్గేదేలే అని సీఎం చెప్పడం ఇంకా హాట్ టాపిక్ అయింది. కానీ అంతలోనే కాంగ్రెస్ ప్రభుత్వ తీరులో వచ్చిన మార్పుపై సర్వత్రా చర్చ మొదలైంది. ఇకపై సినిమా టికెట్ ధరలు పెంచబోమని, స్పెషల్ షోలకు అనుమతి ఉండదన్న సీఎం రేవంత్ రెడ్డి..ఎందుకు మనసు మార్చుకున్నారన్న చర్చ జరుగుతోంది. సినిమా వాళ్లు ఆకాశం నుంచి దిగివచ్చారా అని కామెంట్ చేసి సామాన్యుల మనసు గెలిచుకున్న సీఎం రేవంత్..మళ్లీ సినిమాలకు అనుకూలంగా ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందోనన్న దానిపై ఎవరికి తోచింది వాళ్లు మాట్లాడుకుంటున్నారు.
బెనిఫిట్ షోల అవసరం ఏముందంటూ..
ఇక ఇప్పటికే పుష్ప సినిమా టిక్కెట్ల పెంపు నిర్ణయంపై హైకోర్టులో దాఖలైనా కేసు విచారణలో ఉండగా, ఇప్పుడు గేమ్‌ఛేంజర్ సినిమా టిక్కెట్ల ధరల పెంపుపైనా పిటీషన్ దాఖలైంది. దీంతో పుష్ప-2 సినిమాపై వేసిన పిటిషన్‌తో కలిపి విచారణ పూర్తి చేస్తామంది న్యాయస్థానం. ఈ సందర్భంగా సినిమా టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతులపై కీలక వ్యాఖ్యలు చేశారు న్యాయమూర్తి. వేళకాని వేళల్లో బెనిఫిట్ షోల అవసరం ఏముందంటూ ప్రశ్నించారు.
పుష్ప-2 రిలీజ్ సందర్భంగా జరిగిన ఘటనను చూసిన తర్వాత కూడా మీరు మారరా అంటూ ప్రభుత్వాలపై అసహనం వ్యక్తం చేశారు. సినిమా ప్రదర్శనకు సమయ పాలన ఉండాలని..అర్ధరాత్రి, వేకువజామున అనుమతులు ఇవ్వడం మానవ హక్కుల ఉల్లంఘన అవుతుందని హైకోర్టు అభిప్రాయపడింది. దీంతో ఇప్పుడు సినిమా టికెట్ ధరల పెంపు, స్పెషల్ షోల ప్రదర్శనలపై హైకోర్టు ఏం తీర్పు చెప్పబోతోందని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఓ వైపు అపోజిషన్ నుంచి అటాక్ స్టార్ట్ అయింది. మరోవైపు కోర్టు నుంచి ఎలాంటి తీర్పు వస్తుందోనన్న ఆందోళన కంటిన్యూ అవుతోంది. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉండబోతుందనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.
కూటమి పార్టీల వైపు ఫ్యాన్ పార్టీ నేతల చూపు.. చేర్చుకుంటే ఓ ఇబ్బంది, చేర్చుకోకపోతే మరొకటి..