కూటమి పార్టీల వైపు ఫ్యాన్ పార్టీ నేతల చూపు.. చేర్చుకుంటే ఓ ఇబ్బంది, చేర్చుకోకపోతే మరొకటి..
కార్యకర్తలు, నేతల అభిప్రాయాలకు భిన్నంగా ఎవరినీ చేర్చుకోవద్దని.. చేరికలు తప్పదనుకుంటే ఆచితూచి అడుగులు వేయాలని డిసైడ్ అయినట్లు టాక్.

Pawan and chandrababu
నువ్వొస్తానంటే నేనొద్దంటానా.? ఇదో సినిమా పేరు అయినా.. ఏపీలో కూటమి పార్టీల పరిస్థితి ఇలానే ఉంది. క్యాస్ట్ ఈక్వేషనో..లేక అపోజిషన్‌ను ఇంకా వీక్ చేయాలనే స్ట్రాటజీనో కానీ.. ఫ్యాన్ సిచ్చాప్ చేస్తానంటున్న ప్రతీ నేతకు కండువా కప్పేందుకు ఓకే అంటున్నాయి కూటమి పార్టీలు. అయితే కొందరు నేతల చేరికలు కూటమిలో కుంపటి రాజేస్తున్నాయి.
అపోజిషన్‌లో ఉన్నది వైసీపీ ఒక్కటే. అధికారంలో ఉన్న కూటమిలో మూడు పార్టీలు. జంప్ అయ్యే ప్లాన్‌లో ఉన్న నేతలు..కుదిరితే సైకిల్ సవారీ..కాకపోతే గ్లాస్ పట్టుకుని టీ తాగేందుకు రెడీ అవుతున్నారు. అక్కడ కూడా వర్కౌట్ కాలేదంటే కాషాయ కండువా కప్పుకునేందుకు కూడా వెనకాడటం లేదు. ఇక్కడే కూటమి పార్టీల మధ్య అసంతృప్తులకు దారి తీస్తోంది.
అవకాశవాద నేతల చేరికలపై తెలుగు తమ్ముళ్లలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. అపోజిషన్‌లో ఉన్నప్పుడు తమపై కేసులు పెట్టించి..వేధించిన..నేతలను..ఇప్పుడు అధికారం కోసం..వస్తానంటే ఎలా చేర్చుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ముందు ఏ నేతలైతే కూటమిని తీవ్రంగా విమర్శించారో..వారే ఇప్పుడు చేరడానికి రెడీ అవడం..అధినేతలు కూడా ఓకే చెప్పడంపై లోకల్ లీడర్లు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
లోకల్ లీడర్ల అభ్యంతరాలు
అధికారంలో ఉన్నా లేకున్నా తాము జెండాను మోస్తున్నామని.. కండువాలు మార్చే వలస నేతలకు అవకాశం ఇస్తే తమ పరిస్థితి ఏంటని వాపోతున్నారు. టీడీపీ క్యాడర్, లీడర్లలో ముఖ్యంగా ఈ అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఏలూరులో ఆళ్లనాని చేరికకు అంతా రెడీ అయినా లోకల్ లీడర్లు అభ్యంతరం తెలపడంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన జాయినింగ్‌ను ప్రస్తుతానికి పక్కన పెట్టారు.
అలాగే పసుపు కండువా కప్పుకునేందుకు ఆసక్తి చూపిన పలువురు నేతలకు టీడీపీ నో ఎంట్రీ చెప్పేయడంతో జనసేనలో జాయిన్ అవుతున్నారు. అక్కడ కుదరకపోతే బీజేపీలోకి అయినా వెళ్తున్నారు. ఇది టీడీపీ నేతలకు, కార్యకర్తలకు ఏ మాత్రం నచ్చడం లేదు. అందుకే మాజీమంత్రి బాలినేనిని జనసేనలో చేర్చుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల ఓపెన్‌గానే స్టేట్‌మెంట్ ఇచ్చేశారు.
మంగళగిరి నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యేగా పోటీచేసిన గంజి చిరంజీవి నారా లోకేశ్‌న్ వ్యతిరేకించి, అప్పుడు వైసీపీలో చేరారు. కైకులూరుకు చెందిన జయమంగళ వెంకటరమణ టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో ఎమ్మెల్సీగా పదవిని అనుభవించారు. కూటమి అధికారంలోకి రావడంతో ఆ ఇద్దరు నేతలు వైసీపీకి గుడ్‌బై చెప్పి ఇప్పుడు జనసేన పంచన చేరారు.
వాళ్లిద్దరి చేరికపై లోకల్ టీడీపీ లీడర్లలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్‌ను బీజేపీలో చేర్చుకున్న వ్యవహారం కూటమి పార్టీల మధ్య చిచ్చు రేపింది. ఆడారి ఆనంద్ జాయినింగ్‌పై స్పీకర్ అయ్యన్న చంద్రబాబుకు ఫిర్యాదు చేశారని టాక్.
బలం పెంచుకునే ప్రయత్నాలు
కూటమిగానే ఉంటూ మూడు పార్టీలు తమ బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. వైసీపీని ఇంకా వీక్ చేసే ప్రయత్నంలో భాగంగా..కూటమిలో పార్టీలు స్ట్రాటజీ ప్రకారం జాయినింగ్స్ చేసుకుంటున్నట్లు టాక్. అయితే చేరికలపై ఆయా నియోజకవర్గాల్లోని టీడీపీ నేతల నుంచి తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం అవుతుండటంతో ఇష్యూగా మారింది.
గత ఐదేళ్లు తమను ఇబ్బందిపెట్టిన నేతలు ఇప్పుడు టీడీపీలో చేరుతామన్నా..చంద్రబాబు చేర్చుకునేందుకు రెడీ అయినా తెలుగు తమ్ముళ్లు మాత్రం అస్సలు ఒప్పుకోవడం లేదు. ఒకవేళ జనసేన, బీజేపీలో చేరినా..ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇస్తున్నారు. అయితే చేరికలపై స్థానిక నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుండటంతో త్వరలోనే మూడు పార్టీల అగ్రనేతలు భేటీ కావాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.
కార్యకర్తలు, నేతల అభిప్రాయాలకు భిన్నంగా ఎవరినీ చేర్చుకోవద్దని.. చేరికలు తప్పదనుకుంటే ఆచితూచి అడుగులు వేయాలని డిసైడ్ అయినట్లు టాక్. త్వరలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరితో ప్రత్యేక భేటీ నిర్వహించి, చేరికలపై ఒక అవగాహనకు రావాలని ఫిక్స్ అయ్యారట. చంద్రబాబు ప్లాన్‌తో చేరికల ఇష్యూ చల్లబడుతుందా..లేక అసంతృప్తుల మధ్యే జాయినింగ్స్ కొనసాగుతాయా అనేది చూడాలి మరి.
Winter Holidays Extended : పెరిగిన చలిగాలుల తీవ్రత.. స్కూళ్లకు శీతాకాల సెలవులు పొడిగింపు..!