Ponguleti: మూడు చోట్ల దరఖాస్తు చేసిన పొంగులేటి.. మిగతా రెండు స్థానాలు వారిద్దరి కోసమేనా?

ఆ మూడు స్థానాలకు టిక్కెట్ ఆశిస్తూ దరఖాస్తు చేసుకున్న పొంగులేటి.. ఏ స్థానం నుంచైనా పోటీకి రెడీ అన్న సంకేతాలు పంపారు. ఇంతకీ పొంగులేటి ఎక్కడి నుంచి పోటి చేయనున్నారు? మిగిలిన రెండు స్థానాల్లో బరిలో దిగే నేతలెవరు?

Ponguleti Srinivasa Reddy

Ponguleti Srinivasa Reddy: ఖమ్మం జిల్లా రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌కు గట్టి పట్టున్న ఆ జిల్లాలో.. ఎవరెక్కడ పోటీ చేస్తారనే సస్పెన్స్ కొనసాగుతోంది. బీఆర్ఎస్ (BRS Party) నుంచి కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో (Khammam District) హస్తం గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జిల్లాలో ఉన్న పదింట్లో ఒక్క సీటును కూడా కారు పార్టీ గెలవకుండా చూస్తానంటూ భీషణ ప్రతిజ్ఞ చేసిన ఆయన.. తాను ఎక్కడ పోటీ చేయాలో మాత్రం డిసైడ్ అవ్వలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు జనరల్ స్థానాలు ఉండగా.. ఆ మూడు స్థానాలకు టిక్కెట్ ఆశిస్తూ దరఖాస్తు చేసుకున్న పొంగులేటి.. ఏ స్థానం నుంచైనా పోటీకి రెడీ అన్న సంకేతాలు పంపారు. ఇంతకీ పొంగులేటి ఎక్కడి నుంచి పోటి చేయనున్నారు? మిగిలిన రెండు స్థానాల్లో బరిలో దిగే నేతలెవరు?

ఖమ్మం జిల్లా రాజకీయం ఎప్పుడూ భిన్నమే.. ఒకప్పుడు కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండే ఉమ్మడి ఖమ్మం.. ఆ తర్వాత కాంగ్రెస్ కంచుకోటగా మారిపోయింది. తెలంగాణా వ్యాప్తంగా కారు జోరు సాగినా… ఇక్కడ మాత్రం అధికార బీఆర్ఎస్‌కు ఆశాజనక ఫలితం దక్కలేదు. ఐతే కమ్యూనిస్టులు లేదంటే కాంగ్రెస్క్‌కే జైకొడుతున్నారు ఖమ్మం జిల్లా ఓటర్లు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పట్టుబిగించాలని చూసిన బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీ పొంగులేటి ఆదిలోనే హంసపాదుగా మారారు. ఐదేళ్లుగా బీఆర్ఎస్‌లో కొనసాగిన పొంగులేటి రెండు నెలల క్రితమే కాంగ్రెస్‌లో చేరారు. ఇక అప్పటి నుంచి తన సత్తా చూపిస్తానని.. ఖమ్మంలో కారు పార్టీ అడ్రస్ లేకుండా చేస్తానంటూ శపథాల మీద శపథాలు చేస్తున్నారు.

ఖమ్మం ఎంపీగా పనిచేసిన పొంగులేటికి అంగ, అర్ధ బలాల్లో తిరుగులేదు. జిల్లాలో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా గెలుస్తాననే ధైర్యం ఆయనది. ఐతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 స్థానాలకు కేవలం మూడు మాత్రమే జనరల్ స్థానాలు. మిగిలిన ఏడు సీట్లు ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు స్థానాలు. కాగా, ఎన్నికల్లో పోటీచేయబోయే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న కాంగ్రెస్‌కు పొంగులేటి షాకిచ్చారు. ఏకంగా జిల్లాలో మూడుకు మూడు జనరల్ స్థానాలైన ఖమ్మం, కొత్తగూడెం (Kothagudem), పాలేరు (Palair) స్థానాల నుంచి తనకు టిక్కెట్ కావాలంటూ పొంగులేటి దరఖాస్తు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Also Read: కొడంగల్ నుంచే పోటీ చేస్తా, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పెన్షన్ రూ.4 వేలు : రేవంత్ రెడ్డి

వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి రెడీ అయిన పొంగులేటి తొలుత కొత్తగూడెం నుంచి బరిలో నిలుస్తారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఓసారి ఖమ్మం నుండి పోటీ చేస్తారని.. మరోసారి పాలేరు బరిలో దిగుతారనే ప్రచారం కూడా సాగింది. ఇందులో ఏదో ఒకస్థానం నుంచి ఆయన పోటీ చేయడం ఖాయమని అనుకుంటుండగా, మూడు స్థానాలకూ దరఖాస్తు చేసుకోవడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఐతే పొంగులేటి ఇలా మూడు నియోజకవర్గాలను కోరడంపై వ్యూహం దాగుందని పరిశీలకులు భావిస్తున్నారు. నిజానికి ఆ మూడు నియోజకవర్గాల్లో పొంగులేటి తప్పిస్తే కాంగ్రెస్ లో సమర్థులైన నాయకులు లేరని చెబుతున్నారు. ఖమ్మం నుంచి మంత్రి పువ్వాడ అజయ్ ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఆయనను ఓడించడం అంత తేలికైన పనికాదు.

Also Read: చంద్ర మండలంకూడా ఖతమే.. కేసీఆర్‌పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

ఇక పాలేరులో మాజీ మంత్రి తుమ్మల, కొత్తగూడెంలో మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు కాంగ్రెస్ లో చేరతారని ఆ పార్టీ ఆశిస్తోంది. దీంతో ఎవరు ఎక్కడైనా పోటీ చేసేందుకు వీలుగానే పొంగులేటి ఇలా మూడు స్థానాలకు దరఖాస్తు చేసుకున్నారనే చర్చ గాంధీభవన్లో నడుస్తోంది. ఇదే సమయంలో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల కూడా ఖమ్మం జిల్లా నుంచే పోటీ చేయాలని చూస్తున్నారు. గతంలోనే పాలేరు నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు షర్మిల. ఆమె పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారనే ప్రచారం నేపథ్యంలో పాలేరు కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమె తెరపైకి వచ్చే అవకాశమూ లేకపోలేదు. ఏదిఏమైనా ఈ మూడు నియోజకవర్గాల్లో ఎక్కడో ఒకచోట పొంగులేటి పోటీ చేయడం ఖాయం కాగా, మిగిలిన ఇద్దరిపైనే సస్పెన్స్ కొనసాగుతోంది.

ట్రెండింగ్ వార్తలు