Ponnam Prabhakar: తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు: పొన్నం ప్రభాకర్

వాహనదారులకు ఏడాదికి సుమారు రూ.లక్ష చొప్పున మిగులుతుందని పొన్నం ప్రభాకర్ తెలిపారు.

Minister Ponnam Prabhakar

తెలంగాణలో రవాణా శాఖ పరంగా మార్పులు తీసుకొచ్చి ప్రజల్లో చైతన్యం తెచ్చే కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సెక్రటేరియట్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో హైదరాబాదును కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దుతామని పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు.

దీంతో వాహనదారులకు ఏడాదికి సుమారు రూ.లక్ష చొప్పున మిగులుతుందని పొన్నం ప్రభాకర్ తెలిపారు. రేపటి నుంచే కొత్త ఈవీ పాలసీ వస్తుందని స్పష్టం చేశారు. ఢిల్లి మాదిరిగా హైదరాబాద్‌లో కాలుష్యం రాకుండా చేసేందుకు ఈవీ పాలసీ తీసుకొచ్చామన్నారు.

గతంలో 2020-2030 ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీ తీసుకొచ్చారని పొన్నం ప్రభాకర్ అన్నారు. జీవో నెంబర్ 41 ద్వారా 2026 డిసెంబర్ 31 వరకు ఉంటుందని చెప్పారు. రేపటి నుంచి ఈ జీవో ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ అమలులోకి వస్తుందని తెలిపారు.

తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలకు పరిమితి లేదని పొన్నం ప్రభాకర్ చెప్పారు. కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్ మార్చాలని ప్రణాళికలు తెచ్చామని తెలిపారు. కాలుష్యాన్ని తగ్గించాలంటే ఈవీలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు. హైదరాబాద్‌లో ఇప్పుడున్న మూడు వేల బస్సులు స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు తేవాలని సీఎం నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

బాహుబలి గేటు తొలగింపు.. తెలంగాణ సెక్రటేరియట్‌ వాస్తులో మార్పులు..