బాహుబలి గేటు తొలగింపు.. తెలంగాణ సెక్రటేరియట్‌ వాస్తులో మార్పులు..

ఇకపై ఆ గేటు ద్వారానే సీఎం రేవంత్ రెడ్డి రాకపోకలు సాగించే అవకాశం కనిపిస్తోంది.

బాహుబలి గేటు తొలగింపు.. తెలంగాణ సెక్రటేరియట్‌ వాస్తులో మార్పులు..

Telangana Secretariat Bahubali Gate Removed (Photo Credit : Google)

Updated On : November 17, 2024 / 6:28 PM IST

Telangana Secretariat Bahubali Gate : వాస్తు మార్పులో భాగంగా తెలంగాణ సెక్రటేరియట్ బాహుబలి మెయిన్ ఎంట్రన్స్ గేట్లను ప్రభుత్వం తొలగించింది. గేట్లను తొలగించిన చోట పూర్తిగా గ్రిల్స్ ఏర్పాటు చేయబోతోంది ప్రభుత్వం. హుస్సేన్ సాగర్ వైపు 3వ గేటు దగ్గర తొలగించిన గేటును పెట్టబోతోంది. దాదాపు 6 నెలల నుంచి మెయిన్ ఎంట్రన్స్ గేట్లకు తాళాలు వేసింది సర్కార్. వాస్తు ప్రకారం రాష్ట్ర సచివాలయంలో పలు మార్పులు చేయాలంటూ రేవంత్ సర్కార్ గతంలోనే నిర్ణయం తీసుకుంది.

తూర్పు దిశగా ఉన్న సచివాలయం ప్రధాన మహా ద్వారం ఈశాన్యం వైపునకు మారబోతోంది. దీంతో పాటు ప్రస్తుతం సచివాలయంలోని ఆగ్నేయం వైపు ఉన్న గేటు నెంబర్ 2 నుంచి ఎన్టీఆర్ గార్డెన్ వైపున్న గేటు నెంబర్ 4 వైపునకు నేరుగా వెళ్లేలా రహదారిని నిర్మిస్తున్నారు. సచివాలయంలో ప్రధాన ద్వారానికి ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఈ మార్పులు చేస్తోంది రేవంత్ ప్రభుత్వం.

ఇందులో భాగంగానే ప్రస్తుత ప్రధాన మహా ద్వారాన్ని ఈశాన్యం వైపు మార్చుతుండగా.. ఇకపై ఆ గేటు ద్వారానే సీఎం రేవంత్ రెడ్డి రాకపోకలు సాగించే అవకాశం కనిపిస్తోంది. వాస్తవానికి ఈ ఏడాది జూన్ లోనే సచివాలయ ప్రధాన మహాద్వారాన్ని మూసివేయటంతో పాటు ఆ మార్గం గుండా ఎలాంటి రాకపోకలు జరపడం లేదు.

ఆ ద్వారాలు తెరుచుకోకుండా ఇనుప తీగ చుట్టారు. అయితే, ప్రస్తుతం తూర్పు వైపు ఉన్న ప్రధాన ద్వారం సచివాలయం నిర్మాణం సమయంలో సూచించిన విధంగా వాస్తు ప్రకారం జరగలేదనే చర్చ ఉంది. ఇక ఈ క్రమంలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన కొంత కాలానికే ఈ ప్రధాన మహా ద్వారాన్ని మూసివేసింది.

సచివాలయం వాస్తులో మార్పులు చేర్పులు..
* దాదాపు 6 నెలల నుంచి మెయిన్ ఎంట్రన్స్ గేట్లకు తాళాలు
* వాస్తు మార్పుతో మెయిన్ ఎంట్రన్స్ రెండు గేట్లు తొలగింపు
* సౌత్ ఈస్ట్, నార్త్ ఈస్ట్ గేటు కలుపుతూ 27 ఫీట్ల రోడ్డు నిర్మాణం
* కొత్త నిర్మించే రోడ్డు మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహం
* ఈశాన్యం గేటు నుండి లోపలికి సీఎం, మంత్రుల ప్రవేశం
* సీఎం రేవంత్ రెడ్డి ఛాంబర్ ను మారుస్తున్న అధికారులు
* ప్రస్తుతం సచివాలయంలోని 6వ అంతస్తులో సీఎం కార్యాలయం
* 9వ అంతస్తులోకి మారబోతున్న ముఖ్యమంత్రి కార్యాలయం?
* సీఎం కాన్వాయ్ ఎంట్రీ ప్రధాన ద్వారాన్ని మార్చిన అధికారులు