Hydraa Prajavani : హైదరాబాద్ హైడ్రా కార్యాలయంలో ప్రజావాణి.. ఫిర్యాదులు స్వీకరించిన కమిషనర్ రంగనాథ్

ఈ ఫిర్యాదులు స్వీకరించిన కమిషనర్ రంగనాథ్ అప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో వివరాలు తీసుకుంటున్నారు. అప్పుడు పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు పరిస్థితి ఏంటి?

Hydraa Prajavani : హైదరాబాద్ హైడ్రా కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. ప్రభుత్వ పార్కులు, స్థలాలు, చెరువులకు సంబంధించి ఆక్రమణలపై ప్రజల నుంచి అధికారులు ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. నగరవాసుల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. సంబంధిత అధికారులతో చర్చించి చర్యలకు ఆదేశిస్తున్నారు. మొదటగా వచ్చిన 50మంది ఫిర్యాదుదారులకు టోకెన్లు ఇచ్చారు. టోకెన్ల ప్రకారం వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.

హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ భూములు, నాలాలు, చెరువుల పరిరక్షణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవస్థ హైడ్రా. ఇప్పటికే పలు ప్రాంతాల్లో చెరువులను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చేశారు. ఆక్రమణలపై హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. తాజాగా మరో అడుగు ముందుకు పడింది. ఆక్రమణలపై ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు హైడ్రా అధికారులు.

ఇందుకు హైడ్రా కార్యాలయం వేదికగా మారింది. హైడ్రా కార్యాలయంలో ప్రజావాణి ఏర్పాటు చేశారు. స్వయంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ పబ్లిక్ నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు. నాలాలు, చెరువులు, ప్రభుత్వ పార్కులు, స్థలాలు ఎక్కడెక్కడ కబ్జా అయ్యాయి అని స్థానికులు వచ్చి వివరాలు అందిస్తున్నారు. ఈ ఫిర్యాదులు స్వీకరించిన కమిషనర్ రంగనాథ్ అప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో వివరాలు తీసుకుంటున్నారు. అప్పుడు పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు పరిస్థితి ఏంటి? అనే వివరాలు తెలుసుకుంటున్నారు. ఇందుకు గూగుల్ మ్యాప్స్ సాయం తీసుకుంటున్నారు.

Also Read : ఉత్కంఠ రేపుతున్న కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రేసు.. కాంగ్రెస్ టికెట్‌ రేసులో జీవన్ రెడ్డి వర్సెస్ నరేందర్ రెడ్డి

అప్పుడు చెరువులు, నాలాల విస్తీర్ణం ఎంత ఉండేది? ఇప్పుడు పరిస్థితి ఏంటి? అనే వివరాలు సంబంధిత శాఖల అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. అంతేకాదు అక్కడికక్కడే పరిష్కార మార్గాలు ఏమున్నాయి అనేదానిపై ఆయన ఆరాతీస్తున్నారు. ఒక్కో ఫిర్యాదుదారుకి నాలుగైదు నిమిషాలు సమయం ఇచ్చి సమస్యలు తెలుసుకుంటున్నారు. వాళ్లు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, సమస్య ఏంటి.. ఇలా అన్ని వివరాలు సేకరిస్తున్నారు. మొత్తంగా సమస్యను పరిష్కరించే విధంగా హైడ్రా అధికారులు పని చేస్తున్నారని చెప్పాలి.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అనేక చోట్ల నాలాలు, చెరువులు, పార్కులు కబ్జా అయ్యాయి. వాటిని కబ్జా కోరల నుంచి విడిపించడమే లక్ష్యంగా హైడ్రాను రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతీ సోమవారం ప్రత్యేకంగా ఈ ప్రజావాణిని ఏర్పాటు చేసి ఫిర్యాదులు స్వీకరించి, ఆయా ప్రాంతాల సంబంధిత అధికారుల దృష్టికి సమస్యల తీసుకెళ్తున్నారు. వాళ్ల నుంచి పూర్తి వివరాలు వచ్చిన తర్వాత ఆక్రమణలను తొలగించేందుకు స్థానిక మున్సిపాలిటీ, రెవెన్యూ, ఇరిగేషన్ కు సంబంధించిన డిపార్ట్ మెంట్ల ద్వారా నోటీసులు ఇప్పించి అక్కడున్న అక్రమ నిర్మాణాలను కూల్చివేసే పరిస్థితి ఉంది.

 

Also Read : నల్గొండ కాంగ్రెస్ లో కొత్త, పాతల పంచాయితీ.. రెండుగా చీలిన నకిరేకల్ నియోజకవర్గ క్యాడర్!