ఉత్కంఠ రేపుతున్న కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రేసు.. కాంగ్రెస్ టికెట్‌ రేసులో జీవన్ రెడ్డి వర్సెస్ నరేందర్ రెడ్డి

ఆల్పోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టారు.

ఉత్కంఠ రేపుతున్న కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రేసు.. కాంగ్రెస్ టికెట్‌ రేసులో జీవన్ రెడ్డి వర్సెస్ నరేందర్ రెడ్డి

Updated On : January 20, 2025 / 9:37 PM IST

కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రేసు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. ఓటర్ల నమోదు నుంచి అభ్యర్థుల వరకు..ఎత్తుకు పైఎత్తులు వేస్తూ వస్తున్నాయి పార్టీలు. అయితే కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఎవరికి అవకాశం ఇవ్వబోతుందనేది ఉత్కంఠగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి మరో ఛాన్స్ ఇస్తారని టాక్‌ వినిపించినా..అధిష్టానం పునరాలోచనలో పడిందట.

రీసెంట్‌గా తెరమీదకు వచ్చిన ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి వైపు హస్తం పార్టీ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సూచన ప్రాయంగా ఆయనకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే తనని కాదని మరొకరికి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే జీవన్ రెడ్డి ఊరుకుంటారా.? టికెట్ ఆశించి భంగపడితే నరేందర్ రెడ్డి రెబల్‌గా బరిలోకి దిగుతారా.? అనేది హట్ టాపిక్ గా మారింది.

ఇప్పటికే ప్రచారం షురూ
ఆల్పోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టారు. కాంగ్రెస్ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా రేసులో ఉంటానంటూ ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డికి అవకాశం ఇస్తే…నరేందర్ రెడ్డి ప్రత్యర్థిగా నిలబడటం ఖాయంగా కనిపిస్తోంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను పార్టీలో చేర్చుకోవడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు జీవన్ రెడ్డి. పార్టీ తీరును బహిరంగంగానే తప్పుపట్టారు.

అధిష్టానం తీరుపై గుర్రుగా ఆయన..ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం ఇవ్వకపోతే ఎలాంటి డెసిషన్‌ తీసుకుంటారోనన్న చర్చ జరుగుతోంది. అయితే తనకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలని జీవన్ రెడ్డి ప్రతిపాదన పెట్టారట. అధిష్టానం మాత్రం ఈ విషయంలో ఇంత వరకు క్లారిటీ ఇవ్వలేదంటున్నారు. ఇప్పటికే జీవన్ రెడ్డికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీగా పోటీ చేసే అవకాశాలిచ్చిన కాంగ్రెస్…ఈ సారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చే విషయంలో మాత్రం కాస్త ఆలోచిస్తుందట.

టికెట్‌పై గంపెడాశాలు
ఆల్పోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి కాంగ్రెస్ టికెట్‌పై గంపెడాశాలు పెట్టుకున్నారు. రాష్టంలో అధికారంలో ఉండటంతో పాటుగా..పట్టభద్రుల నియెజకవర్గ పరిధిలో మెజార్టీ హస్తం పార్టీ ఎమ్మెల్యేలు ఉండటం కలిసి వస్తుందని భావిస్తున్నారట. వారి సపోర్ట్‌తో పాటుగా…తన శిష్యులు, టీచింగ్‌ సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల ఓట్లు, మిగతా విద్యాసంస్థల నిర్వహకుల మద్దతుతో ఈజీగా గెలుస్తానని లెక్కలు వేసుకుంటున్నారట లెక్కల మాస్టారు.

కాంగ్రెస్ టికెట్‌ కోసం ఏఐసీసీ పెద్దలను కలవడంతో పాటు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల మద్దతు కోరారట. ఇప్పటివరకు ఏఐసీసీ, పీసీసీ నేతలను, సీఎం రేవంత్ రెడ్డిని అడపదడపా కలుస్తూ ప్రచారం చేయడానికి పరిమితమైన నరేందర్ రెడ్డి…ఇప్పడు లోకల్ ఎమ్మెల్యేలను కలవడం చర్చనీయాంశంగా మారింది.

టికెట్‌ కోసం పోటీ పడుతున్న జీవన్ రెడ్డి..నరేందర్ రెడ్డి ఇద్దరిలో కాంగ్రెస్ ఎవరికి షేక్ హ్యండ్ ఇస్తుందో..ఎవరికి సారీ చెప్తుందనేది ఆసక్తికరంగా మారింది. జీవన్ రెడ్డి అడిగినట్టుగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవి ఇస్తే నో ఇష్యూ. లేదంటే అలకలు, బుజ్జగింపులతో ఫలితాలపై ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉందంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. సీనియర్‌ నేతకా..విద్యా సంస్థల అధినేతకా హస్తం పార్టీ అవకాశం కల్పించేదెవరికో చూడాలి మరి.

మరోవైపు, ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన మదనం గంగాధర్ కూడా కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ ఆశిస్తున్నారు. బాల్యం నుంచి ఎన్నో కష్టాలు పడి, పని చేసుకుంటూనే చదువుకున్న మదనం గంగాధర్ డీఎస్పీ స్థాయికి ఎదిగారు. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలని భావిస్తున్నారు.

విశాఖ సాగర తీరంలో బొత్స రాజకీయ ఎత్తులు.. వచ్చే ఎన్నికల్లో తన కొడుకును బరిలోకి దింపే ప్లాన్?