విశాఖ సాగర తీరంలో బొత్స రాజకీయ ఎత్తులు.. వచ్చే ఎన్నికల్లో తన కొడుకును బరిలోకి దింపే ప్లాన్?
విజయనగరం భీమిలీ పక్కపక్కనే ఉంటాయి. రాజకీయంగా సామాజికవర్గాల పరంగా రెండు చోట్లా ఒకే విధంగా ఉంటుంది.

బొత్స సత్యనారాయణ. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆయన పాలిటిక్స్ తీరే వేరు. దాదాపుగా కాంట్రవర్సీలకు దూరంగా..ప్రజలకు దగ్గరగా ఉంటూ వస్తుంటారు బొత్స. ఇప్పుడు వైసీపీలో ఉన్న ఆయన..పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తాను మాత్రం క్యాబినెట్ ర్యాంకులో కొనసాగుతున్నారు. ఎమ్మెల్సీగా గెలిచి..పట్టుబట్టి మండలిలో ప్రతిపక్ష నేత హోదా దక్కించుకున్నారు.
అయితే వచ్చే ఎన్నికల కోసం ఆయన ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారట. ఎన్నికలు ఎప్పుడొచ్చినా విశాఖ ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారట బొత్స. అంతేకాదు విశాఖ జిల్లా నుంచే తన భవిష్యత్తు రాజకీయాలను మొత్తం నడపాలని చూస్తున్నారట.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో కీలక నాయకుడిగా ఉన్న బొత్స సత్యనారాయణ.. ఇప్పటికే విశాఖ కేంద్రంగా తన యాక్టివిటీని స్పీడప్ చేశారు. తనకంటూ సొంత ఆఫీసుని ఏర్పాటు చేసుకుని..మీడియా సమావేశాలు పెడుతూ..విశాఖకు సంబంధించిన అనేక అంశాలపై కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నారు. లీడర్లకు అందుబాటులో ఉంటూ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచనతోనే బొత్స వైజాగ్ కేంద్రంగా పాలిటిక్స్ నడిపిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.
భవిష్యత్తు కోసం ప్రణాళికలు
విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి ఐదు సార్లు పోటీ చేస్తే మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు బొత్స. ఇక 2029 ఎన్నికల నాటికి చీపురుపల్లి నుంచి తన కుమారుడు బొత్స సందీప్‌ను ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని చూస్తున్నారట. అలాగే గజపతినగరం తన తమ్ముడికి వదిలేశారట. విజయనగరం జిల్లాలో మొత్తం తన అనుచరులు, సన్నిహితులకు సీట్లు ఉండేలా చూసుకుంటున్నారు. ఇక బొత్స తనతో పాటు తన మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావును కూడా విశాఖ జిల్లాకు తీసుకొచ్చారన్న చర్చ సాగుతోంది. లేటెస్ట్‌గా భీమిలి వైసీపీ ఇంచార్జ్‌గా మజ్జి శ్రీనివాసరావుకు బాధ్యతలు అప్పగించింది ఫ్యాన్ పార్టీ అధిష్టానం.
నెల క్రితం వరకూ భీమిలీ వైసీపీ ఇంచార్జ్‌గా మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు కొనసాగారు. ఆయన వైసీపీకి రాజీనామా చేయడంతో ఖాళీ ఏర్పడింది. దాంతో మజ్జి శ్రీనివాసరావుతో ఇంచార్జ్ పోస్ట్‌ను భర్తీ చేసింది వైసీపీ అధిష్టానం. దాంతో 2029 ఎన్నికల్లో ఆయన భీమిలీ నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయమంటున్నారు.
పోటీకి లైన్ క్లియర్?
విజయనగరం భీమిలీ పక్కపక్కనే ఉంటాయి. రాజకీయంగా సామాజికవర్గాల పరంగా రెండు చోట్లా ఒకే విధంగా ఉంటుంది. బొత్స సామాజికవర్గం కూడా భీమిలీలో అధికంగా ఉంటుంది. దాంతో అక్కడ పార్టీ గెలుపు ఈజీ అవుతుందని వైసీపీ హైకమాండ్ కోరి మరీ మజ్జి శ్రీనివాసరావుని పంపించిందని అంటున్నారు. బొత్స కూడా విశాఖ లోక్‌సభకు తాను.. ఎమ్మెల్యేగా శ్రీనివాసరావు పోటీకి లైన్ క్లియర్ అయిందని అనుకుంటున్నారట.
విశాఖ జిల్లాల్లోని చాలా అసెంబ్లీ నియోజకవర్గాలలో కూడా మార్పుల వెనక బొత్స వ్యూహాలు ఉన్నాయని అంటున్నారు. తనకు అనుకూలంగా ఉన్న నేతలకు నియోజకవర్గ ఇంచార్జ్‌లు దక్కేలా ప్లాన్ చేశారని..ఇంకా ఖాళీగా ఉన్న సెగ్మెంట్లలో కూడా తన వర్గం లీడర్లకు ఇంచార్జ్ బాధ్యతలు వచ్చేలా చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.
ఇలాంటి పొలిటికల్ స్టెప్పులతో కేరాఫ్ విశాఖ అన్నట్లుగా రాజకీయాలను నడిపిస్తున్నారట బొత్స. వైసీపీకి విశాఖ జిల్లాలో బలమైన నాయకత్వం లేకపోవడం బొత్సకు అడ్వాంటేజ్‌గా మారుతోందట. బొత్స ఎంపీగా పోటీ చేస్తారా లేక..ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతారా అనేది చూడాలి మరి.
Nakirekal Constituency: రెండుగా చీలిన నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్ క్యాడర్!