KPHB Cricket Betting Gang : ప్రియురాలికి ప్రాంక్ మెసేజ్.. మొత్తం బెట్టింగ్ ముఠానే బుక్..! కేపీహెచ్‌బీలో భారీ ట్విస్ట్
KPHB Cricket Betting Gang : మద్యం మత్తులో తాను కిడ్నాపైనట్లు ప్రియురాలికి ప్రాంక్ మెసేజ్ చేయడంతో.. ఆ యువకుడి బెట్టింగ్ మాఫియా గుట్టురట్టయింది.
- Harish Thanniru
- Published on- August 23, 2026 / 01:09 PM IST
KPHB Cricket Betting Gang
KPHB Betting Case : తాను కిడ్నాప్ అయ్యానంటూ ప్రియురాలికి ఓ యువకుడి ప్రాంక్ మెసేజ్.. కేపీహెచ్‌బీలో క్రికెట్ బెట్టింగ్ ముఠాను గుట్టురట్టు చేసింది. యువకుడి నుంచి మెసేజ్ రావడంతో నిజమేనని నమ్మిన యువతి.. 112కు కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో హుటాహుటీన పోలీసులు యువకుడి ప్లాట్‌కు వెళ్లి తనిఖీలు చేయగా.. బెట్టింగ్ ముఠా గుట్టురట్టయింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఏపీలోని చంద్రగిరి ప్రాంతంకు చెందిన సుమంత్, మనోజ్, గౌతమ్‌లు కేపీహెచ్‌బీలో షేరింగ్ పద్దతిలో ప్లాట్ అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నారు. సుమంత్ అనే యువకుడు మద్యం మత్తులో తాను కిడ్నాప్ అయ్యానంటూ ప్రియురాలికి ప్రాంక్ మెసేజ్ పంపాడు. ఆ మెసేజ్ నిజమేనని నమ్మిన యువతి భయాందోళనకుగురై వెంటనే 112 నంబర్ సహాయంతో పోలీసుకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పింది. యువతి ఫిర్యాదుతో రంగంలోకిదిగిన పోలీసులు జియో లొకేషన్ ఆధారంగా సదరు ప్లాట్‌కు వెళ్లారు. లోపలికి వెళ్లి తనిఖీలు చేయడంతో అసలు గుట్టురట్టయింది.
పోలీసుల తనిఖీల సమయంలో సూట్‌కేసులో ఏకంగా రూ.30లక్షల నగదు బయటపడింది. దీంతో ఆ డబ్బు ఎక్కడిది అంటూ పోలీసులు సుమంత్ ను ప్రశ్నించారు. అతడి నుంచి సరియైన సమాధానం రాకపోవటంతో అనుమానం వచ్చిన పోలీసులు గట్టిగా ప్రశ్నించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. క్రికెట్ బెట్టింగ్, హవాలా నెట్‌వర్క్ వ్యవహారాలు విస్తుపోయేలా వెలుగులోకి వచ్చాయి. వెంటనే ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. రూ.30లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల విచారణలో .. మనోజ్ అసిస్టెంట్ ఫిల్మ్ డైరెక్టర్‌గా పనిచేస్తుండగా.. గౌతమ్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. సుమంత్ ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్లు తేలింది. అయితే, ఈ 30లక్షలు నగదు ఎక్కడి నుంచి వచ్చింది.. ఎవరి ద్వారా వచ్చింది..? ఎప్పటి నుంచి బెట్టింగ్ వ్యవహారం కొనసాగుతోంది.. ఎక్కడ నుంచి వీరికి కనెక్షన్ ఉంది అనే విషయాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
