టెన్త్ క్లాస్ హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకునే క్రమంలో సాంకేతిక లోపం కారణంగా వచ్చిన పొరబాటు షాక్ ఇచ్చింది. 2022114399 అనే అకౌంట్ నెంబర్‌తో హిదాయత్ పబ్జీ అనే హాల్ టిక్కెట్ దర్శనమిచ్చింది. పరీక్ష మొదలవడానికి కొద్ది నిమిషాల ముందు హాల్ టిక్కెట్ ను క్యాన్సిల్ చేశారు అధికారులు. దీనిపై తెలంగాణ డైరక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ సత్యనారాయణ రెడ్డి స్పందించారు. విషయం తెలిసిన వెంటనే వెబ్ సైట్ నుంచి హాల్ టిక్కెట్ తీసేసినట్లు వెల్లడించారు. (డబ్బులిస్తే రాసి పెడతారు..న్యూ మదీనా కాలేజీ బాగోతం)
టోలీచౌకీలోని న్యూ మదీనా జూనియర్ కాలేజీ 8మంది విద్యార్థులను బుధవారం హైపవర్ కమిటీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ప్రిన్సిపాల్ షోయబ్ తన్వీర్, స్టాఫర్లు షాబా, షహీదా షరీన్, సయ్యద ఖలీముద్దీన్‌లను పోలీసులు అరెస్టు చేశారు. కాపీ కొడుతూ పట్టుబడ్డ 8మంది విద్యార్థుల్లో నలుగురిని అరెస్టు చేశారు. అందులో ఇద్దరు మైనర్లుకావడంతో తల్లిదండ్రులకు అప్పగించారు.
సమాచారం అందుకున్న గోల్కొండ పోలీసులు ఎగ్జామ్ హాల్‌కు వెళ్లేసరికి 8మంది విద్యార్థులు కాపీ కొడుతూ కనిపించారు. ఇందులో ప్రిన్సిపాల్ ప్రమేయం కూడా ఉందని జిల్లా ఇంటర్మీడియల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్(డీఐఈఓ) జయప్రద బై తెలిపారు. మూడురోజులుగా ఇలా జరుగుతున్నట్లు తెలుసుకున్న మేం దాడి చేశాం. ‘మూడు పరీక్షలకు విద్యార్థులకు సమాధానాలు కూడా చెప్తున్నట్లు తెలియడంతో వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోగలిగాం’ అని అన్నారు.
కాలేజీ యజమాన్యం 3రోజుల్లోగా వివరణ ఇవ్వాలని న్యూ మదీనా కాలేజీకు నోటీసులు పంపినట్లు టీఎస్బీఐఈ కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ వ్యాఖ్యానించారు. విద్యార్థుల దగ్గర్నుంచి డబ్బులు వసూలు చేసి.. ఈ మాస్ కాపీయింగ్ కు పాల్పడుతున్నట్లు సమాచారం. ఈ మేరకు సెక్రటరీ, కరెస్పాండెంట్ నుంచి వివరణ కోరింది బోర్డు.