puvvada ajay kumar
Puvvada Ajay: సౌమ్యుడిగా పేరుంది. ప్రజాసేవలోనూ ముందుంటారు. అనుకోని పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయారు ఆ మాజీ మంత్రి. పార్టీకి పవర్ చేజారిపోవడంతో కాస్త సైలెంట్ అయ్యారు. ఇప్పుడు తన సీటును వదిలి మరో సెగ్మెంట్‌కు వెళ్లాలని అనుకుంటున్నారట. ఆయన ఎవరో కాదు మాజీమంత్రి పువ్వాడ అజయ్.
ఖమ్మం ఎమ్మెల్యేగా, రాష్ట్రమంత్రిగా పనిచేసిన పువ్వాడ అజయ్ గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఇప్పుడు శేరిలింగంపల్లి నియోజకవర్గం మీద ఆయన నజర్ పెట్టినట్లు తెలుస్తోంది. శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న అరికపూడి గాంధీ పార్టీ మారడంతో..అదే సామాజికవర్గానికి చెందిన పువ్వాడ అజయ్ శేరిలింగంపల్లిపై ఫోకస్ పెట్టినట్లు గులాబీ పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ మాజీ మంత్రి పార్టీ పెద్దలకు తన మనసులోని మాటచెప్పేశారని కూడా టాక్ వినిపిస్తోంది.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయి ఏడాది కూడా కాలేదు. కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలపై వేగంగా పావులు కదుపుతుంది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఇందుకు సంబంధించి మరో అడుగు ముందుకు పడే అవకాశం కనిపిస్తుంది. జనాభా లెక్కలు, కులగణన, నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ వంటి ఎన్నో అంశాలు సాధారణ ఎన్నికలతో ముడిపడి ఉన్నాయి.
2029 ఎన్నికలపై ఫోకస్
అయినా కొంతమంది నేతలు ఇప్పటి నుంచే 2029 ఎన్నికలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో ప్రతిపక్ష పార్టీకి చెందిన పువ్వాడ అజయ్ ఖమ్మం జిల్లా రాజకీయాలను కాదనుకొని ఇక గ్రేటర్‌లో తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో శేరిలింగంపల్లి నుంచి గులాబీ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికైన అరికపూడి గాంధీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో చేరిపోయారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కీలక పదవి కూడా దక్కింది. దాంతో శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ ఎంపికపై గులాబీ పార్టీ కసరత్తు కూడా మొదలు పెట్టలేదు.
ఈ సెగ్మెంట్‌కు చెందిన కీలక నేతలు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొంతమంది, ఆ తర్వాత మరికొంతమంది కారు దిగి కాంగ్రెస్‌లో చేరిపోయారు. గులాబీ పార్టీకి ఈ నియోజకవర్గంలో అరికపూడి గాంధీకి ధీటుగా నాయకత్వం వహించే నేత కనిపించడం లేదన్న చర్చ ఉంది. దీన్ని పసిగట్టిన పువ్వాడ..తాను అదే సామాజిక వర్గానికి చెందిన నేతను కావడంతో ఇప్పటినుంచే నియోజకవర్గంపై ఫోకస్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారట.
ఇక్కడ కలిసి వస్తుందని అంచనా
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా ప్రకారం లక్షకుపైగా ఓటర్లు కమ్మ సామాజికవర్గానికి చెందినవారే ఉన్నారు. ఈ కారణంగానే అదే సామాజిక వర్గానికి చెందిన గాంధీ టీడీపీ, బీఆర్ఎస్‌లో టికెట్లు దక్కించుకొని ఎమ్మెల్యేగా గెలిచారు.
ఇప్పుడు పువ్వాడ కూడా అదే బలమైన కమ్మ సామాజికవర్గాన్ని ప్రస్తావిస్తూ శేరిలింగంపల్లి నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్నందుకు రెడీగా ఉన్నానని పార్టీ పెద్దలకు చెప్పేశారట. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తన విద్యాసంస్థలు కూడా మొదలుపెట్టడంతో ఇక్కడ కలిసి వస్తుందని అంచనాతో ఉన్నారట ఆ మాజీ మంత్రి.
గులాబీ పార్టీ పెద్దలు మాత్రం ఈ విషయంలో ఇప్పటికీ ఓ అభిప్రాయానికి రావడం లేదని తెలుస్తోంది. ఇప్పటికిప్పుడే ఇన్‌చార్జ్‌గా పువ్వాడ అజయ్‌ని నియమిస్తే క్యాడర్‌తో ఇబ్బందులు వస్తాయనే అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం. అయితే మాజీ మంత్రి ఆశలు నెరవేరుతాయా లేదా అన్నది మాత్రం నియోజకవర్గ నేతల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. పార్టీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.