Raghunandan Rao : దళితబంధు రాలేదని..? కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి, ఎమ్మెల్యే రఘునందన్ కీలక వ్యాఖ్యలు

బీజేపీ నాయకుల ఇళ్లు, దుకాణాలపై దాడులు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాన్ని నమ్మొద్దు. Raghunandan Rao

Raghunandan Rao Madhavaneni

Raghunandan Rao Madhavaneni : బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని ఖండించారు దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఈ వ్యవహారంపై స్పందించిన రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తి దాడి దురదృష్టకరం, బాధాకరం అన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించారాయన. ప్రజాస్వామ్యంలో దాడులు పరిష్కారం కావన్నారు రఘునందన్ రావు. కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పాలమూరు నుండి నేరుగా ఆస్పత్రికి వెళ్లి ప్రభాకర్ రెడ్డిని పరామర్శిస్తానని రఘునందన్ రావు చెప్పారు.

నిందితుడు రాజు జై కాంగ్రెస్ అని రాసుకున్నాడు..
”నిందితుడు ఘటాని రాజు జై కాంగ్రెస్, జై మిరుదొడ్డి మండలం అని ఫేస్ బుక్ లో స్టేటస్ రాసుకున్నాడు. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తో కలిసి దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి సీపీ పూర్తి వివరాలు వెల్లడిస్తే బాగుండేది. దిపాయన్ పల్లి గ్రామానికి చెందిన కార్యకర్త స్వామిని పోలీసులు మఫ్టీలో ఎత్తుకెళ్లారు. దుబ్బాక బీజేపీ కార్యాలయంపై దాడి చేశారు. కొంతమంది కౌన్సిలర్లు మా సిబ్బందిపై భౌతికదాడి చేశారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. బీజేపీ నాయకుల ఇళ్లు, దుకాణాలపై దాడులు చేస్తున్నారు.

Also Read : హత్యా రాజకీయాలు వద్దు, మా సహనాన్ని పరీక్షించొద్దు- ప్రభాకర్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండించిన సీఎం కేసీఆర్

దళితబంధు రాలేదని..
ఎన్నికల కోడ్ అమల్లో ఉంటే రఘునందన్ రావు దిష్టి బొమ్మ దహనం చేస్తుంటే ఏం చేస్తున్నారు? దళితబంధు రాలేదని ఆవేదనతో ఘటనకు పాల్పడ్డాడు అని మీడియాలో వస్తోంది. కార్యకర్తలు సంయమనం పాటించండి. సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాన్ని నమ్మొద్దు. రాజు మద్యం మత్తులో ఉన్నాడు, కుటుంబసభ్యులతో కలహాలు ఉన్నాయని మీడియాలో వస్తోంది.

బీజేపీ కండువా కప్పినట్టు ప్రచారం జరుగుతున్న వ్యక్తి నిందితుడు కాదు. పొడేటి నర్సింహులు నిన్ననే బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరాడు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. సిద్దిపేట సీపీపై వారం క్రితమే డీజీపీకి ఫిర్యాదు చేశా. సీఎం అడుగులకు మడుగులు నొక్కుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాణెనికి చెరోవైపు” అని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు.

”రఘునందన్ కు సంబంధం లేని అంశంలో రఘునందన్ ను ఇరికించాలని, రఘునందన్ పేరుని బద్నాం చేయాలని చూస్తున్నారు. దుబ్బాకలో బీఆర్ఎస్ వాళ్లు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటే రఘునందన్ ని నిందిస్తారు, దిష్టిబొమ్మ దగ్ధం చేస్తారు. సిద్ధిపేటలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందో లేదో సీపీ చెప్పాలి. ఆ యాక్ట్ అమల్లో ఉంటే బీఆర్ఎస్ వాళ్లు 100 మంది జమమై రఘునందన్ దిష్టిబొమ్మను తగలబెడుతుంటే దుబ్బాక, సిద్ధిపేట పోలీసులు ఏం చేస్తున్నారు? జరిగిన ఘటనకు మాకు సంబంధం లేకున్నా.. మాకు సంబంధం ఉందని మాపై బురద జల్లే ప్రయత్నాన్ని ఎందుకు పోలీసు యంత్రాంగం చూస్తూ ఊరుకుందో చెప్పాలి” అని రఘునందన్ రావు డిమాండ్ చేశారు.

Also Read : ప్రభాకర్ రెడ్డి గన్‌మెన్ అలర్ట్‌గా లేకపోయుంటే ఊహించని ఘోరం జరిగేది, సర్జరీ తర్వాతే తెలుస్తుంది- మంత్రి హరీశ్ రావు

కాగా, కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి ఘటన పొటిలిటికల్ హీట్ పెంచింది. ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ను టార్గెట్ చేశారు. దాడి చేసిన నిందితుడు రాజు కాంగ్రెస్ కార్యకర్త అని తొలుత ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఎమ్మెల్యే రఘునందన్ రావుతో రాజు ఉన్న ఫోటో వైరల్ అయ్యింది. దీనిపై రఘునందన్ రావు తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావుతోనూ నిందితుడు రాజు ఫోటోలు దిగాడని కామెంట్ చేశారు.