Raghunandan Rao
Raghunandan Rao : ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచింది. అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య చిచ్చు రాజేసింది. ప్రధాని మోదీ పర్యటనకు సీఎం కేసీఆర్ హాజరుకాలేదు. దీన్ని బీజేపీ నేతలు తప్పుపడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్రంగా స్పందించారు.
ప్రశాంత్ కిషోర్ సలహాతోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రధాని మోదీతో కయ్యానికి కాలు దువ్వుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. మోదీ నాయకత్వంలో అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూస్తున్నారని ఆయన చెప్పారు. ప్రతిపక్షాలను కూడా ఆహ్వానించి మా సంస్కృతిని తెలియజేశామన్నారు.(Raghunandan Rao)
తమిళనాడు సీఎం స్టాలిన్.. ప్రధాని మోదీకి సాదర స్వాగతం పలికితే.. కేసీఆర్ ఎందుకు పలకడం లేదని ఆయన ప్రశ్నించారు. ఆహ్వానానికి ముఖ్యమంత్రి రాకుంటే మంత్రులు రావాలని రాజ్యాంగంలో ఉందా? అని నిలదీశారు. బీజేపీకి తీవ్రంగా వ్యతిరేకించే వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా మోదీని స్వాగతించారని ఎమ్మెల్యే రఘునందన్ రావ్ గుర్తు చేశారు. తెలంగాణలో రాజకీయాలను బీఆర్ఎస్ పార్టీ కలుషితం చేస్తోందని మండిపడ్డారు. సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు.
Also Read..PM Modi : కేంద్ర ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేదు : ప్రధాని మోదీ
”దొంగే దొంగా అన్నట్లు ఉంది కేసీఆర్ పరిస్థితి. మళ్లీ ఎన్నికల వరకు సిద్దిపేటలో రైల్ ఆగుతుంది. దుబ్బాకలో బీజేపీ గెలవడం వల్లే నిధులు ఆపుతూ విషం చిమ్ముతున్నారు. రాజ్ దీప్ సర్ దేశాయ్.. ప్రతిపక్షాల కూటమికి తనను చైర్మన్ చేయాలనడం దేనికి సంకేతం? మోదీకి కేసీఆర్ ముఖం చాటేశారు. అభివృద్ధి అనేది సంతులితంగా జరగాలి. మనకంటే పెద్ద వారు వస్తే గౌరవించాలని అంబేద్కర్ రాజ్యాంగంలో ఉంది. సూర్యుని మీద ఉమ్మేసినట్టు బీఆర్ఎస్ పరిస్థితి ఉంది. దుబ్బాక ప్రజలపై అక్కసు చూపెడుతున్నారు మంత్రి హరీశ్ రావు.(Raghunandan Rao)
మీరు ఎమ్మెల్యే కాక ముందు కోమటిచెరువు ఎఫ్‌టీఎల్ ఎంత? నేడు కోమటిచెరువు పరిస్థితి ఏంటి? విషం చిమ్మడం బీఆర్ఎస్ ధ్యేయం. అక్రమ ఆస్తులపై అందరూ శ్రీ కృష్ణ జన్మస్థలానికి పోవాల్సిందే. మాది వసుదైక కుటుంబం. వారిది మా కుటుంబం బాగుండాలని అలోచన. మధ్యప్రదేశ్ లో బీజేపీ ఎమ్మెల్యే వరసగా 8సార్లు గెలిచారు” అని రఘునందన్ రావు అన్నారు.
హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోదీ.. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో దుమారం రేపాయి. అవినీతి పార్టీ, కుటుంబ పాలన, కేంద్ర ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం లేదంటూ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. ప్రధాని మోదీ పచ్చి అబద్దాలు చెప్పారని ఆరోపించారు. ఈ తొమ్మిదేళ్లలో ప్రధాని మోదీ తెలంగాణ రాష్ట్రానికి ఒక్క సాయం కూడా చేయలేదని ఎదురుదాడికి దిగారు.