వరద నీటిలో చిక్కుకున్న పోలీసుల కుటుంబాలు.. 300 అధికారుల ఇళ్లల్లోకి వరద నీరు

  • Publish Date - October 15, 2020 / 04:07 PM IST

CP Anjani Kumar : భారీ వర్షాలతో హైదరాబాద్ జలమయమైపోయింది. రోడ్లు, కాలనీలు కాలువలను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలీసు కుటుంబాలకు వాన కష్టాలు తప్పడం లేదు. ముంపు బాధితుల కోసం విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు కుటుంబాలు కూడా వరద నీటిలో చిక్కుకున్నాయి.



హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ ఇంట్లోకి వరద నీరు చేరింది. దీంతో నాలుగు రోజులుగా ఆయన ఆఫీసులోనే ఉంటూ డ్యూటీ చేస్తున్నారు. మరో 300 మంది పోలీసు అధికారుల ఇళ్లలోనూ వరద నీరు చేరింది. పోలీసుల కుటుంబాలు వరద నీటిలో చిక్కుకున్నప్పటికీ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు.



హైదరాబాద్ నగరంలో వరద సహాయక చర్యల కోసం ఏర్పాట్లు చేశామని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. మూసి లోతట్టు ప్రాంతంలో కొన్ని చోట్ల వరద నీరు చేరిందన్నారు. కుల్సుంపుర, కార్వాన్, తప్పాచపుత్ర, అఫ్జల్‌గంజ్‌, మలక్‌పేట్‌, చాదర్‌ఘాట్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో మాత్రం వరద ఉధృతి ఎక్కువగా ఉందని తెలిపారు.



ఫలక్‌నామా ప్రాంతంలో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందన్నారు. ముంపు ప్రాంతాల్లో పోలీసులు విస్త్రృతంగా సహాయక చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఇప్పటికే ఆర్మీ కూడా రంగంలోకి దిగిందని చెప్పారు. రెస్క్యూ ఆపరేషన్‌ జరుగుతున్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అవసరమైతే తప్ప ప్రజలు ఎవరు బయటకు రావద్దని సీపీ అంజనీ సూచించారు.

ట్రెండింగ్ వార్తలు