street dogs
Street Dogs : దేశ వ్యాప్తంగా ఇటీవల వీధి కుక్కలపై దాడులు, వాటికి విషంఇచ్చి హతమార్చడం వంటి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లాలో 400కుపైగా కుక్కలకు విషపు ఇంజక్షన్లు ఇచ్చి చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. హనుమకొండ జిల్లాలోనూ ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ఇదే తరహా ఘటన తాజాగా రంగారెడ్డి జిల్లా యాచారం గ్రామ పంచాయతీ పరిధిలో జరిగింది.
యాచారం గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి సుమారు 100 కుక్కలకు విషపు ఇంజక్షన్లు ఇచ్చి చంపించారని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ యాచారం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. స్ట్రే యానిమల్స్ ఫౌండేషన్ ప్రతినిధి ముదావత్ ప్రతీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ విషయమై యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్, మాజీ ఎంపీ మేనకాగాంధీకి కూడా ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. ఆమె రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీంతో కలెక్టర్ పోలీసులతో ఫోన్లో మాట్లాడారు.
గ్రామంలో వీధి కుక్కలు చిన్న పిల్లలను కరుస్తుండటంతో పాటు.. కోళ్లు, మేకలపైనా దాడులు చేస్తుండటంతో కొందరు గ్రామస్తులు సర్పంచ్, గ్రామ పంచాయతీ కార్యదర్శికి పలుమార్లు ఫిర్యాదులు చేశారు. దీంతో 100 వీధి కుక్కలకు వారు విషపు ఇంజెక్షన్లు ఇచ్చి హతమార్చినట్లు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
కుక్కలకు ఇంజెక్షన్లు ఇచ్చి చంపేందుకు ముగ్గురు ప్రొఫెషనల్స్ ను రప్పించినట్లు తెలుస్తోంది. చనిపోయిన కుక్కలను ట్రాక్టర్లో ఊరవతలకు తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో పాతిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. కుక్కలను పాతిపెట్టిన ప్రదేశం నుంచి బయటకుతీసి గురువారం వాటికి పోస్టుమార్టం నిర్వహించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.