Rats Eat Currency : ఆపరేషన్ కోసం దాచుకున్న సొమ్ము ఎలుకలు కొరికేశాయ్

ఓ వృద్ధుడు తన ఆపరేషన్ కోసం కష్టపడి సంపాదించిన సొమ్ము..అప్పు తెచ్చి కూడబెట్టిన డబ్బును ఎలుకలు కొరికేయటంతో లబోదిబోమంటున్న ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

Rats Eat Currency : ఓ వృద్ధుడు తన ఆపరేషన్ కోసం కష్టపడి సంపాదించిన సొమ్ము..అప్పు తెచ్చి కూడబెట్టిన డబ్బును ఎలుకలు కొరికేయటంతో లబోదిబోమంటున్న ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.  జిల్లాలోని మహబూబాబాద్ మండలం వేంనూర్ శివారు ఇందిరానగర్ తండాలో నివసించే రెడ్యా కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

4 సంవత్సరాల క్రితం అనారోగ్యానికి గురికావడంతో మహబూబాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చూపించుకున్నాడు. కడుపులో కణితి  ఏర్పడిందని  హైదరాబాద్ కి వెళ్ళాలని సూచించారు. హైదరాబాద్ లో పరీక్షలు చేయించుకోగా ఆపరేషన్‌కు రూ.4 లక్షల వరకు ఖర్చుఅవుతుందని వారు తెలిపారు.  దీంతో కడుపులో నొప్పి భరిస్తూనే కూరగాయల వ్యాపారం చేసుకుంటూ కూడబెట్టిన సొమ్ము, మరోవైపు అప్పుగా తీసుకొచ్చిన సొమ్ము సుమారు 2 లక్షల రూపాయలను తన ఇంట్లోని బీరువాలో దాచి పెట్టాడు.

తీరా హాస్పటల్‌‌కు వెళ్దామని బీరువా లోని డబ్బులు తియ్యగా అవన్నీ చిరిగిపోయి.. ఎలుకలు కొట్టిన దృశ్యం కనిపించింది.  ఆ చిరిగిపోయిన నోట్లను మార్చుకోటానికి మహబూబాబాద్ లోని అన్ని బ్యాంకుల చుట్టూ తిరిగాడు. ఎవరూ ఇక్కడ చెల్లవని, హైదరాబాద్ లో రిజర్వు బ్యాంకుకు వెళ్లాలని, అక్కడ కూడా ఈ నోట్లను తీసుకుంటారో, తీసుకోరో చెప్పలేము అని చెప్పడంతో ఆ వృద్ధుడు కన్నీటి పర్యంతం అవుతూ..తనకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు.

ట్రెండింగ్ వార్తలు