తెలంగాణ రాష్ట్రంలో రసవత్తరంగా సాగిన దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు ఇవాళ(10 నవంబర్ 2020) రానున్నాయి. నేతల మధ్య మాటలు, వ్యక్తుల మధ్య పోట్లాటలు.. మొత్తానికి దుబ్బాక మినీ రణరంగం క్రియేట్ చేసింది. ఈ క్రమంలో దుబ్బాక ఉప ఎన్నిక విజేతలు ఎవరో నేడు తేలనుంది. ఫలితం కోసం అన్ని పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా.. అభ్యర్ధుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. నవంబర్ 3వ తేదీన ఈ ఉప ఎన్నిక పోలింగ్ జరగగా.. ఓట్ల లెక్కింపు కోసం సిద్దిపేట సమీపంలోని పొన్నాల ఇందూరు ఇంజనీరింగ్ కళాశాలలో అధికారులు ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు.
దుబ్బాక ఉపఎన్నిక మొత్తం 315 పోలింగ్ స్టేషన్ల పరిధిలో జరగగా.. మొత్తం 23 మంది పోటీ చేశారు. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. మొత్తం రెండు గదుల్లో ఒక్కో గదిలో 7 టేబుల్స్ చొప్పున 14 టేబుల్స్‌లో 27 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 10గంటల వరకు ట్రెండ్స్ మధ్యాహ్నం 12 గంటల వరకు ఉపఎన్నిక ఫలితం రాబోతుంది.
టీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కాగా.. ఈ ప్లేస్‌లో మళ్లీ జెండా ఎగరెయ్యాలని అధికార టీఆర్ఎస్ పార్టీ, ఈ స్థానంలో పట్టు నిలుపుకోవాలని ప్రతిపక్ష కాంగ్రెస్, ఎలాగైనా గెలిచి రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం కావాలని బీజేపీ, దుబ్బాక ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ క్రమంలో పోటీ రసవత్తరంగా మారగా.. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన అన్నీ పార్టీలకు ఈ ఫలితం కీలకంగా మారింది.
https://10tv.in/congress-party-pathetic-condition-in-nizamabad/
టీఆర్‌ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత గెలుపు తథ్యమని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తుండగా.. సర్వేలన్నీ తమకు అనుకూలంగానే ఉన్నాయని తమ పార్టీ అభ్యర్థి రఘునందన్‌రావు గెలుపు ఖాయమని బీజేపీ అంటుంది. మరోవైపు కాంగ్రెస్ కూడా తమ ఓటు బ్యాంకు గట్టిగా ఉందని, మెజారిటీ ఓట్లు పడ్డాయని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చనిపోవడంతో అక్కడ ఉప ఎన్నిక వచ్చింది.
దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపు ఎంత కీలకమో రెండో స్థానం కూడా అంతే కీలకం. ఎందుకంటే గతంలో రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో దుబ్బాక ప్రజలు భిన్నమైన తీర్పు ఇచ్చారు. 2009లో సోలిపేట రామలింగారెడ్డి, చెరుకు ముత్యంరెడ్డి నువ్వా నేనా అన్నట్లు తలపడగా.. చివరకు 2,640 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి ముత్యంరెడ్డి గెలిచారు. 2014లో టీఆర్‌ఎస్ అభ్యర్థి రామలింగారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి ముత్యంరెడ్డిపై 37,925 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
2018లో టీఆర్‌ఎస్ అభ్యర్థి రామలింగారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి మద్దుల నాగేశ్వర్‌రెడ్డిపై 62,500 ఓట్ల తేడాతో గెలిచారు. ఇలా మూడు పర్యాయాలు పోటీ టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య జరిగింది. అయితే ఇప్పుడు బీజేపీ బలం తేలేందుకు ఈ ఉపఎన్నిక ఫలితాలపై ఆధారపడి ఉంది.