Indiramma Housing Scheme Representative Image (Image Credit To Original Source)
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బిల్లుల మంజూరుకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఇకపై ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రతి వారం బిల్లులు మంజూరు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. లబ్ధిదారులు వేగంగా నిర్మాణ పనులు పూర్తి చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. కాగా, ఇప్పటివరకు నిధుల లభ్యతను బట్టి సోమవారం రోజున ఇందిరమ్మ ఇళ్ల నిధులు మంజూరు చేసింది ప్రభుత్వం.
తమ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3వేల 500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లను కేటాయించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇళ్ల కోసం 22వేల 500 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. స్థలం ఉన్న వారు ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. గోదావరిఖనిలో పర్యటించిన డిప్యూటీ సీఎం.. రామగుండం కార్పొరేషన్‌లో 175 కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు.
ప్రతి పేదవాడి సొంతింటి కలను నెరవేర్చాలన్న లక్ష్యంతో రేవంత్ ప్రభుత్వం పని చేస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం తీసుకొచ్చింది. ఇందులో భాగంగా దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లను లబ్దిదారులకు మంజూరు చేస్తోంది.
2026 ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ప్రారంభించేందుకు సర్కార్ సన్నాహాలు చేస్తోంది. మధ్య తరగతి కుటుంబాల కోసం కూడా ప్రత్యేకంగా ఇళ్లు కేటాయించనుంది. జీ ప్లస్ త్రీ, జీ ప్లస్ ఫోర్ విధానంలో అర్బన్ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
మరోవైపు రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం అమలుకు ఏర్పాట్లు చేసుకుంటోంది ప్రభుత్వం. దీనికి సంబంధించి కసరత్తు జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల కోడ్‌కి ముందే నోటిఫికేషన్ ఇవ్వాలని సర్కార్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల 50వేల ఇళ్ల నిర్మాణం చేపట్టనుంది. ప్రతి నియోజకవర్గానికి 3వేల 500 చొప్పున ఇళ్ల మంజూరుకు ప్రణాళికను సిద్ధం చేసుకుంటోంది.
Also Read: మంత్రులు, మహిళా ఆఫీసర్ల మీద వార్తలపై తీవ్ర వివాదం.. ఇంతింతై వటుడింతై అన్నట్లు