Rice Mills For Womens : మహిళలకు రైస్ మిల్లులు.. రేవంత్ సర్కార్ మరో గుడ్‌న్యూస్, ఒక్కో మిల్లుకి రూ.3.50 కోట్లు..

ప్రతి మండల కేంద్రంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైస్‌ మిల్లులు, గోదాములు నిర్మించి ఇస్తామని మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్​ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Rice Mills For Womens : మహిళా సాధికారిత దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది. మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేలా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆర్టీసీ బస్సుల నిర్వహణ, సౌర విద్యుత్ ఉత్పత్తి రంగాల్లో మహిళలను భాగస్వామ్యం చేసిన ప్రభుత్వం.. తాజాగా రైస్‌ మిల్లుల పరిశ్రమలోకి మహిళలను తీసుకొచ్చేందుకు కార్యాచరణ ప్రారంభించింది. మహిళా సంఘాలకు తోడ్పాటు అందించేందుకు ప్రతి మండలంలో ఒక రైస్‌ మిల్లు నిర్మించేందుకు ప్లాన్ చేస్తోంది సర్కార్.

ప్రతి మండల కేంద్రంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైస్‌ మిల్లులు, గోదాములు నిర్మించి ఇస్తామని మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్​ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో 553 మండల మహిళా సమాఖ్యలు ఉన్నాయి.

Also Read : పవన్ కల్యాణ్‌కు ప్రధాని మోదీ ఫోన్.. మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా

రైస్ ​మిల్లుల నిర్మాణానికి ప్రభుత్వమే ఉచితంగా స్థలం ఇవ్వనుంది. ఒక్కో మిల్లు నిర్మాణానికి ఎకరన్నర స్థలం అవసరం అవుతుంది. ఒక్కో మిల్లు నిర్మాణానికి 3 కోట్ల 50 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. స్థలాన్ని ఉచితంగా ఇవ్వడంతో పాటు నిధులను బ్యాంకు రుణాల ద్వారా సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణంగా రైస్ మిల్లులు నిర్వహించే వ్యాపారవేత్తలు నాబార్డ్ నుంచి రుణాలు తీసుకుంటారు. ఇందుకోసం ఆస్తులు తనఖా పెట్టాల్సి ఉంటుంది. అయితే, మహిళా సంఘాలకు ఆ అవసరం ఉండదని, ప్రభుత్వమే మహిళలకు, బ్యాంకులకు మధ్యవర్తిగా వ్యవహరించడంతో పాటు గ్యారెంటీ కూడా ఇస్తుందట.

రైస్ మిల్లుల విషయంలో.. ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్న ప్రాంతాలు, ఆయా పథకాల్లో చురుగ్గా పాల్గొంటున్న మహిళా సంఘాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోందట.

Also Read : పెద్ద భూ కుంభకోణం.. ఒక బీజేపీ ఎంపీ కూడా.. 3 రోజుల్లో బయటపెడతా: కేటీఆర్

ఇక, రైస్ ​మిల్లులు నిర్మించి ఇవ్వాలంటే గోదాముల అవసరం ఉంటుంది. సేకరించిన ధాన్యాన్ని, మిల్లింగ్​ చేసిన బియ్యం నిల్వ చేయడానికి గోదాములు అవసరం. దీంతో మహిళా సంఘాలకు గోదాములు కూడా నిర్మించి ఇవ్వనుంది ప్రభుత్వం. గోదాముల నిర్మాణ బాధ్యతలను మార్కెటింగ్‌ శాఖకు అప్పగించనుంది సర్కార్.