రోజూ రూ.191 కోట్లు చెల్లింపు.. రేవంత్ సర్కార్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అప్పులు

ఇలా పాత అప్పులకు వడ్డీలు కడుతూ.. కొత్త అప్పులు చేస్తూ.. పాలనను నెట్టుకొస్తుంది రేవంత్ సర్కార్. మరి ఎంతకాలం ఇలా అప్పుల మీదే ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపుతారన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది.

Telangana State Debts : గత ప్రభుత్వం చేసిన అప్పులు ఓవైపు.. తాజాగా చేస్తున్న అప్పులు మరోవైపు.. ఇక అప్పులకు కడుతున్న వడ్డీలు ఇంకోవైపు. గతంలో, ఇప్పుడు ఇబ్బడిముబ్బడిగా తెస్తున్న అప్పులు రేవంత్ సర్కార్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు నిధులు సమీకరించుకుంటూనే పాత అప్పులకు వడ్డీలు కట్టడం తెలంగాణ ప్రభుత్వానికి సవాల్ గా మారింది.

తలకు మించిన భారంలా పాత అప్పులు..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి గత ప్రభుత్వం చేసిన అప్పులు భారంగా మారాయి. సీఎంగా రేవంత్‌రెడ్డి అధికారం చేపట్టే నాటికి రాష్ట్రం అప్పులు దాదాపు 7లక్షల కోట్ల రూపాయలు ఉండగా.. వాటికి వడ్డీలు కట్టడం తలకు మించిన భారం అవుతోంది. పాత అప్పులకు ప్రతిరోజూ దాదాపు 191 కోట్ల వరకు అసలు, వడ్డీ చెల్లిస్తుందట రేవంత్ సర్కార్. డిసెంబర్ 7న కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆరు నెలల్లో పాత అప్పులకు సంబంధించిన దాదాపు 38వేల కోట్ల వరకు అసలు ప్లస్ వడ్డీ చెల్లించిందని అధికారులు చెబుతున్నారు. అసలే జీతాలు, సంక్షేమ పథకాల అమలు కోసం అవస్థలు పడుతోన్న రేవంత్‌ ప్రభుత్వానికి.. పాత అప్పులు తలకు మించిన భారంగా మారాయి.

ఆ రెండు పథకాల కోసం అప్పులు చేయాల్సిందే..
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అప్పులతో ఇబ్బందులు పడుతూనే కొత్త అప్పులు చేస్తోంది రేవంత్ సర్కార్. డిసెంబర్ నుంచి జూన్ 17వ తేదీ వరకు రేవంత్ ప్రభుత్వం 25వేల 118 కోట్ల రూపాయల అప్పు తీసుకుంది. అయినా ఖజానా ఎప్పుడూ ఖాళీగానే కనిపిస్తోందట. ఉద్యోగుల జీతాల నుంచి మొదలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలకు తోడు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు వేల కోట్ల రూపాయలు కావాలి. అందులో మరీ ముఖ్యంగా రైతు రుణమాఫీ, రైతు భరోసాకు దాదాపు 40వేల కోట్ల రూపాయలు అవసరమని అంచనా వేస్తున్నారు. ఈ రెండు పథకాల కోసం అప్పులు చేయడం తప్ప మరో గత్యంతరం లేదు.

అప్పుల మీద ఆధారపడి ఎంత కాలం ఇలా?
హైదరాబాద్‌లో విలువైన భూములను బ్యాంకులకు తాకట్టు పెట్టి అప్పు తీసుకునే ప్రయత్నం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇలా పాత అప్పులకు వడ్డీలు కడుతూ.. కొత్త అప్పులు చేస్తూ.. పాలనను నెట్టుకొస్తుంది రేవంత్ సర్కార్. మరి ఎంతకాలం ఇలా అప్పుల మీదే ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపుతారన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది.

Also Read : రఘునందన్‌తో హరీష్ రావు చెట్టా పట్టాల్.. త్వరలోనే బీజేపీలోకి: ప్రభుత్వ విప్‌లు

ట్రెండింగ్ వార్తలు