×
Ad

Revanth Reddy: స్పీకర్‌ తీర్పుపై వాళ్లు ఇలా చేయొచ్చు: పార్టీ ఫిరాయింపుల ఇష్యూపై రేవంత్‌ రెడ్డి

స్పీకర్ ప్రకటనను బీఆర్‌ఎస్‌ ఎన్నడూ ఖండించలేదని చెప్పారు.

Revanth Reddy

Revanth Reddy: తెలంగాణలో పార్టీ ఫిరాయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేలలో ఐదుగురికి నిన్న క్లీన్‌చీట్‌ ఇస్తూ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ ఇచ్చిన తీర్పుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పందించారు.

ఇవాళ రేవంత్‌ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ ఇచ్చిన తీర్పు ఎవరికైనా నచ్చకపోతే కోర్టులకు వెళ్లవచ్చని అన్నారు. స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై తాము స్పందించడానికి ఏమీ లేదని తెలిపారు. (Revanth Reddy)

Also Read: కేసీఆర్‌ ఇలాకాలో గెలిచాం.. ప్రజల తీర్పు ఏం చెబుతోందంటే?: పంచాయతీ ఎన్నికలపై రేవంత్‌ రెడ్డి స్పందన ఇదే..

అసెంబ్లీ సమావేశాల ముగింపులో స్పీకర్ పార్టీల వారీగా సభ్యుల వివరాలు ఇచ్చారని అన్నారు. స్పీకర్ ప్రకటనను బీఆర్‌ఎస్‌ ఎన్నడూ ఖండించలేదని చెప్పారు.

కాగా, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు (భద్రాచలం), బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి (గద్వాల) , గూడెం మహిపాల్‌రెడ్డి(పటాన్ చెరు), ప్రకాశ్‌ గౌడ్‌ (రాజేంద్రనగర్), అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి) అనర్హత వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై స్పీకర్‌ నిన్న తీర్పు వెలువరించారు.

ఆ పిటిషన్లను కొట్టివేశారు. ఈ ఐదుగురు పార్టీ మారినట్టు నిరూపించేలా ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్నట్టు వారు పార్టీ మారినట్టు ఆధారాలు లేవని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డిని వారు కలిసిన సందర్భాలను పార్టీ మారినట్టుగా పరిగణించలేమని అన్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన ఈ ఎమ్మెల్యేలు ఆ తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ సుప్రీంకోర్టులో బీఆర్ఎస్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.

ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు నవంబరు 17న పేర్కొంది. వచ్చే విచారణ తేదీలోపు ఆ పిటిషన్లపై చర్యలు తీసుకోవాలని లేదంటే కోర్టు ధిక్కరణను ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో స్పీకర్ తన నిర్ణయాన్ని వెల్లడించారు.