Revanth Reddy
Revanth Reddy: అభివృద్ధిని అడ్డుకునే వారిని స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించొద్దని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సర్కారుకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారిని గెలిపిస్తే గ్రామాలు అభివృద్ధి చెందవని చెప్పారు. మంత్రుల వద్దకు వెళ్లి నిధులు అడిగే నేతలను సర్పంచ్‌లుగా గెలిపించాలని ఆయన కోరారు.
ఉమ్మడి ఏపీలోనే కాకుండా బీఆర్ఎస్ పాలనలో ప్రత్యేక తెలంగాణలోనూ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నిర్లక్ష్యానికి గురైందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో నేటి నుంచి ప్రజా పాలన వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. (Revanth Reddy)
Also Read: పవన్ కల్యాణ్ ఒక మాట పదేపదే చెబుతుంటారు: చంద్రబాబు
నేటి నుంచి డిసెంబర్ 7 వరకు ఉత్సవాలు జరగనున్నాయి. వారం రోజులపాటు జిల్లాల పర్యటన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా నేడు నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలో నిర్వహించిన ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాల బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.
సీఎంగా ఉన్న సమయంలో కేసీఆర్ రూ.8 లక్షల కోట్ల అప్పు చేశారని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు తమ ప్రభుత్వం ఆ అప్పులు తీరుస్తూనే, రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. తాము పాలమూరు జిల్లా ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని నిర్ణయించామని ఆయన చెప్పారు.
బీఆర్ఎస్ పాలనలో నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్లక్ష్యానికి గురైతే తాము చేపట్టామని అన్నారు. కొందరు కేసులు వేసి అడ్డుకున్నారని చెప్పారు. పాలమూరు జిల్లాలో కృష్ణా నది పారుతున్నప్పటికీ స్థానిక ప్రజలకు నీళ్లు అందలేదని అన్నారు. తాము నీటి పారుదల, విద్యను ప్రాధాన్య అంశాలుగా తీసుకున్నామని రేవంత్ చెప్పారు.