Road accident
Suryapet District : సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని అర్వపల్లి మండలం జాజిరెడ్డిగూడెం సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ కారు రోడ్డుపక్కకు దూసుకెళ్లి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఉపాధ్యాయురాలు స్పాట్‌లో మరణించగా.. మరో ఉపాధ్యాయురాలు తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు. మరో ఇద్దరు హెడ్మాస్టర్లకు గాయాలయ్యాయి. కారు ప్రమాదం సమయంలో మొత్తం ఐదుగురు ఉన్నారు. వారిలో ముగ్గురు మహిళలు ఇద్దరు పురుషులు ఉన్నట్లు తెలిసింది.
Also Read : Evil Eye: 2026లో నరదిష్టి ఎక్కువగా తగిలే రాశులు ఇవే..! ఇలా చేస్తే సులభంగా బయటపడతారు..!
సంక్రాంతి సెలవుల అనంతరం శనివారం స్కూల్స్ ఓపెన్ అయ్యాయి. ఈ క్రమంలో పాఠశాలలు ఓపెన్ అయినందున నల్గొండ నుండి కారులో ఉపాధ్యాయులు వెళ్తున్నారు. అర్వపల్లి మండలం జాజిరెడ్డిగూడెం సమీపంలో కారు అదుపుతప్పి రోడ్డుపక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కల్పన అనే ఉపాధ్యాయురాలు స్పాట్లోనే మృతిచెందగా.. రావులపల్లి గ్రామ జడ్పీహెచ్ఎస్ హెచ్ఎంగా పనిచేస్తున్న గీతారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే, ఆమెను చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు వదిలింది.
ఈ ప్రమాదంలో తుంగతుర్తి జడ్పీహెచ్ఎస్ హెచ్ఎంగా పనిచేస్తున్న అల్వాల ప్రవీణ్ కు, అన్నారం జడ్పీహెచ్ఎస్ హెచ్ఎంగా పనిచేస్తున్న సునీతకు గాయాలయ్యాయి. వారిని 108 అంబులెన్సు ద్వారా చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. వేగంగా వెళ్తున్న కారు టైర్ పేలడం వల్లనే అదుపు తప్పి బోల్తాకొట్టినట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటన స్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.