GHMC Mayor Gadwal Vijaya Lakshmi
GHMC Mayor : జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ ఇంట్లోకి ఓ రౌడీ షీటర్ చొరబడి హల్చల్ చేశాడు. రెండు రోజులపాటు మేయర్ ఇంటి చుట్టూ తిరిగిన రౌడీ షీటర్.. కండువా కప్పుకొని నేరుగా ఇంట్లోకి చొరబడ్డాడు. సిబ్బంది వారించే ప్రయత్నం చేసినా ఇంటిలోకి వెళ్లిపోయాడు. ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్లిన రౌడీ షీటర్ ను భద్రత సిబ్బంది అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ లోని ఎన్బీటీ నగర్ లో ఈ ఘటన జరిగింది.
Also Read : Lok Sabha Elections 2024 : తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక.. షెడ్యూల్ ఇలా..
మేయర్ ఇంట్లోకి చొరబడిన వ్యక్తిని యూసఫ్ గూడకు చెందిన రౌడీ షీటర్ లక్ష్మణ్ గా గుర్తించారు. లక్ష్మణ్ ఇంట్లోకి చొరబడిన సమయంలో మేయర్ విజయలక్ష్మీ ఇంట్లో లేరు. ఆమె తండ్రి కేశవరావుకు ఇటీవలే మోకాలికి శస్త్ర చికిత్స జరగడంతో ఆమె ఆస్పత్రిలోనే ఉన్నట్లుగా సమాచారం. అయితే, మేయర్ ఇంటి వద్ద భద్రతా సిబ్బంది బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు మేయర్ నివాసం వద్దకు చేరుకొని రౌడీ షీటర్ లక్ష్మణ్ ను అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. లక్ష్మణ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతన్ని రిమాండ్ కు తరలించారు. అయితే, లక్ష్మణ్ కు మతిస్థిమితం సరిగా లేనట్లు పోలీసులు గుర్తించారు.
ఇదిలాఉంటే బీఆర్ఎస్ పార్టీ తరపున జీహెచ్ఎంసీ మేయర్ గా బాధ్యతలు స్వీకరించిన గద్వాల్ విజయలక్ష్మీ ఇటీవల ఆ పార్టీని వీడిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె తండ్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత కె. కేశవరావుసైతం బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో తీర్థం పుచ్చుకున్నారు.