RSS : చిలుకూరు బాలాజీ పూజారిపై దాడి.. ఆర్ఎస్ఎస్ కీలక ప్రకటన.. మరోసారి ఇలాంటివి..

ధర్మ పరిరక్షణ పేరుతో వ్యక్తిగత స్వార్థం చూసుకునే వారే ఈ విధంగా దాడికి పాల్పడ్డారంది.

RSS : చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడిని ఆర్ఎస్ఎస్ ఖండించింది. దాడికి పాల్పడిన వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసింది. దేవాలయాల పరిరక్షణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రంగరాజన్ పై దాడిని.. వ్యక్తిపై దాడిగా భావించవద్దంది.

సామాజిక విలువలు, సనాతన ధర్మం, మొత్తం హిందుత్వంపై జరిగిన దాడిగా ఆర్ఎస్ఎస్ భావిస్తుందన్నారు. ధర్మ పరిరక్షణ పేరుతో వ్యక్తిగత స్వార్థం చూసుకునే వారే ఈ విధంగా దాడికి పాల్పడ్డారంది. సంఘ విద్రోహ శక్తులను కఠినంగా శిక్షించి మరోసారి ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా చూడాలని ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రచార ప్రముఖ్ కట్ట రాజు గోపాల్ ప్రభుత్వాన్ని కోరారు.

చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధానార్చకులు రంగరాజన్ పై దాడి ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఈ నెల 7న రంగరాజన్ ఇంటికి వెళ్లిన కొందరు వ్యక్తులు ఆయనపై దాడికి పాల్పడ్డారు.

Also Read : చిలుకూరు బాలాజీ అర్చకులు రంగరాజన్ కు కేటీఆర్ పరామర్శ.. రేవంత్ సర్కార్ పై తీవ్ర విమర్శలు..

వీరరాఘవరెడ్డి అనే వ్యక్తి ‘రామరాజ్యం’ పేరుతో ఓ సైన్యాన్ని నిర్మించాడు. తన సైన్యానికి నిధులు ఇవ్వాలని, భక్తులను తమ ఆర్మీలో చేర్పించాలని రంగరాజన్ ను కోరాడట. అందుకు తిరస్కరించడంతో ఆగ్రహించిన వీరరాఘవరెడ్డి అతని అనుచరులు తనపై దాడి చేశారని రంగరాజన్ వాపోయారు.

రంగరాజన్ పై దాడి ఘటనను అందరూ ముక్తకంఠంతో ఖండించారు. పలువురు రాజకీయ నాయకులు స్వయంగా రంగరాజన్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. మేము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. దాడికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని రేవంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరక్కుండా చర్యలు తీసుకోవాలన్నారు.

అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఫోన్ లో అర్చకులు రంగరాజన్ ను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయనకు భరోసా ఇచ్చారు. దాడికి పాల్పడ్డ వారిని వదలొద్దని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.